కాలగర్భంలోకి ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మరోమారు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రక్రియ ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. గత పదిహేనేళ్లుగా మన దేశంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం కొనసాగింది. అయితే ఇటీవలి కాలంలో, ముఖ్యంగా గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య జరిగిన బ్యాంకుల విలీనం ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఉంది. 2019 ఏప్రిల్ లో విజయ బ్యాంకు, దేనా బ్యాంకును బరోడా బ్యాంకులో విలీనం చేశారు. ఆ తరవాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకుతో, సిండికేట్ బ్యాంకుని కెనరా బ్యాంకుతో, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు.
కాలగర్భంలోకి ఆంధ్రాబ్యాంక్..
తెలుగు వారికి గడిచిన 97 సంవత్సారాలుగా బ్యాంకింగ్ సేవలు అందించిన ‘ఆంధ్రాబ్యాంక్’ కాలగర్భంలో కలిసిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్ విలీనమై తన ఉనికినే కోల్పోయాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. ఇందిరాగాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణలో భాగంగా 1980 ఏప్రిల్‌లో ఆంధ్రా బ్యాంక్ జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి 31వ తేదీ నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఎటిఎంలకు ఆంధ్రాబ్యాంక్ విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఎబి ఉద్యోగుల నిరసన..
యూబిఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తమవుతోంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ ధరించి బుధవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో గల పూర్వపు ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకుల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను క్రమబద్ధీకరిస్తామని యూబిఐ మేనేజింగ్, సిఈఓ ప్రకటించడాన్ని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు, ప్రజావ్యతిరేక, బ్యాంకుల వ్యతిరేక, ఉద్యోగుల వ్యతిరేక విధానలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఆలిండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎఐఎబిఎఇయు) నేతలు ఉద్యోగులను కోరారు. ఆంధ్రాబ్యాంక్ విలీనంపై ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేరని తెలిపారు. మరోవైపు తెలుగు ప్రజలు నెటిజనులు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్య అని కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయం వల్ల తెలుగువారి ఆంధ్రాబ్యాంకు ఇక కనపించదని అంటున్నారు. ఒకవేళ విలీనం చేసినా బ్యాంకు పేరు మార్చవద్దంటూ నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్యాగ్ చేసి మరీ కోరుతున్నారు. లేదా యూనియన్ ఆంధ్రా బ్యాంక్ అని పేరు పెట్టాలని సూచిస్తున్నారు.
అమలులోకి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
RELATED ARTICLES