ఐజెయు, టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో అమరులకు జర్నలిస్టుల నివాళి
ప్రజాపక్షం / హైదరాబాద్ : అమర వీరుల త్యాగాల సాక్షిగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజెయు) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఐజెయు, టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు, కరోనా మృతులకు జర్నలిస్టులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణతో తమ దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం లభిస్తుందని అన్ని వర్గాలు ఆశించినట్లే జర్నలిస్టులు ఆశించారని అన్నారు. ఆరేళ్ళు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో జర్నలిస్టులకు నిరుత్సాహం తప్పలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసన తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీనివాస్‌రెడ్డి, విరాహత్ అలీ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజెయు కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్‌నాథ్, టియుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఈశ్వర్ రెడ్డి, బి.కిరణ్‌కుమార్, ఎ.రాజేష్, వి.యాదగిరి, జిలానీ, స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్‌యుజె అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సిడి ఆవిష్కరణ: కరోనాపై యుద్ధంలో జర్నలిస్టుల పాత్రను శ్లాఘిస్తూ ఇఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ రవిశంకర్ రూపొందించిన పాటను ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ , టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్‌ను జర్నలిస్టు నేతలు ప్రశంసించారు.
అమర వీరుల త్యాగాల సాక్షిగా రాజీలేని పోరాటాలు
RELATED ARTICLES