ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్ బైరామల్‌గూడ మల్టీలెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం
ప్రజాపక్షం/హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణానుద్దేశించి సిఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్‌బి నగర్ వాసులు ఎదురుచూస్తున్న బైరామల్‌గూడ మల్టీలెవల్ ఫ్లైఓవర్ శనివారం అందుబాటోకి వచ్చింది. మంత్రు లు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంఎల్‌ఎలు డి. సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణిదేవి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి ప్లు ఓవర్‌ను ప్రారంభించారు. ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా సాగర్ కూడలిలో రూ.194 కోట్ల తో సెకండ్ లెవల్ ఫ్లుఓవర్‌ను జిహెచ్‌ఎంసి నిర్మించింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సాగర్ రింగ్‌రోడ్డు జంక్షన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొందరు పాతబస్తీలో మెట్రో ఆపాలని చూస్తున్నారని, మెట్రోను ఆపాల ని కేంద్రానికి పదేపదే చెబుతున్నారన్నారు. కేం ద్రాన్ని ఉసిగొల్పేవారిని ముందే హెచ్చరిస్తున్నానన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడే వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. మెట్రో విస్తరణకు పునాది రాయి వేస్తే, కాళ్లలో కట్టె పెట్టేలా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అలాంటి వాళ్లకు నగర బహిష్కరణ తప్పదని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. తాము ఒకపక్క పునాది రాయి వేసేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతి ఇస్తున్నామంటూ లేఖ పంపిందన్నారు. అభివృద్ధి కోసం సంతోషంగా శంకుస్థాపన చేస్తుంటే ఒకాయన ఢిల్లీ వెళ్లి మరీ, ప్రాజెక్ట్ ఆపమని కోరుతూ కేంద్రానికి చెబుతున్నారని తెలిపారు. మీకు చేయాటానికి చేతకాకపోతే, మేము చేసేటప్పుడు కనీసం కాళ్లలో కట్టెపెట్టకుండా ఉండాలని కోరుతున్నాను అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
రూ. 50 వేలకోట్లతో మూసీ నది ఆధునికీకరణ..
నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సేవలు అందిస్తామని చెప్పారు. ఎల్.బి.నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మించి, అక్కడి వరకు మెట్రో నిర్మిస్తామని చెప్పారు. రూ. 50 వేలకోట్లతో మూసీ నదిని ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. మూసీ నది అభివృద్ధితోపాటు 2050 నాటికి వైబ్రాంట్ తెలంగాణ ప్రణాళిక సిద్ధం అవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి ప్రణాళికలను ఆమోదించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు.
హైదరాబాద్ చుట్టూ ఔటరింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించింది కాంగ్రెస్సేనన్నారు. ఓఆర్‌ఆర్ లోపలున్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండిలో కలుపుతామన్నారు. భవిష్యత్‌లో నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌తో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఎల్‌బి నగర్‌కు వస్తే నా గుండె వేగం పెరుగుతోంది...
ఎల్‌బి నగర్ నగర్‌కు వస్తే తన గుండె వేగం పెరుగుతుందని, తన స్నేహితులు, బంధువులు, జిల్లా ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంఎల్‌ఎగా కొడంగల్‌లో ఓడిపోయినా, మల్కాజిగిరి ఎంపిగా ఇక్కడి ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి, ప్రజా గొంతుకను చేశారని గుర్తుకు తెచ్చుకున్నారు. మీరు ఎంపిగా గెలిపిస్తే పిసిసి అధ్యక్షుడిని అయ్యా, ఆ తర్వాత సిఎం అయ్యా. ఇదంతా మీ అభిమానం, మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను అని సిఎం అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తా : ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి కోసం త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తానని ఎల్.బి. నగర్ ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి అన్నారు. రేవంత్‌ను మల్కాజిగిరి ఎంపిగా ఎల్.బి.నగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని, ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించాలని ఆయన కోరారు. సమస్యలపై ప్రత్యేకంగా కలిసేందుకు సమయం ఇవ్వాలని సిఎంను కోరారు.
అభివృద్ధికి అడ్డుపడితే బహిష్కరణే!
RELATED ARTICLES