కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు మరోసారి వాయిదా పడిం ది. దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని పదవీత్యుతుడ్ని చేసి, గత నెల 15న కాబూల్‌ను తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. తమ పాలన ఖరారైందన్న నమ్మకం వచ్చిన వెంట నే ప్రభుత్వ ఏర్పాటుకు వారు ప్రయత్నించారు. అందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభించారు. అయితే, అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకోవడానికి వీలుగా మంత్రివర్గ ఏర్పాటును సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేశారు. అయితే, ఇంకా పూర్తిగా స్పష్టతరాని కారణం గా ప్రభుత్వాన్ని వచ్చేవారం ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయమైంది. తాము ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామని, కానీ, అన్ని పార్టీలు, వర్గాల మద్దతును కూడగడుతున్నామని తాలిబన్ ప్రతినిధి ఖలీల్ హకానీ ప్రకటించారు. తాలిబన్ సర్కారును ప్రపంచ దేశాలు గుర్తించవన్న వాస్తవం గతంలోనే నిరూపితమైంది. కాబట్టి, మరోసారి అలాంటి సమస్య తలెత్తకుండా ఇప్పుడు తాలిబన్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వేచ్ఛాయుతమైన పాలనను అందిస్తామని హామీ ఇస్తున్నారు. అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఉదారవాదాన్ని అమలు చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలు, వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు ఖలీల్ హకానీ తెలిపారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు, జమాయత్ ఎ ఇస్లాం అఫ్గానిస్థాన్ చీఫ్, మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్మాత్యార్‌తో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందరి సమ్మతితో, ఆమోదయోగ్యమైన పాలనను అందించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలిపారు.
కాబూల్‌కు ఐఎస్‌ఐ చీఫ్
అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ లెప్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ శనివారం కాబూల్ చేరుకున్నారు. తాలిబన్ నాయకులతో ఆయన చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ ప్రభుత్వాన్ని అంగీకరించాలంటే, దాని కూర్పు ఎలా ఉండాలనే అంశంపై ఆయన వారికి సూచనలిస్తారని సమాచారం.
అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు వచ్చే వారానికి వాయిదా
RELATED ARTICLES