అమెరికా, జపాన్, చైనా మోడల్ అనుసరిస్తాం
ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాం.. హామీలన్నీ నెరవేరుస్తాం
బడ్జెట్‌పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎలాంటి దాపరికాలు లేకుండా వాస్తవిక ఆర్థిక స్థితిగతులను బడ్జెట్‌లో చెప్పామని, ఆర్థిక మాంద్యం ఏఏ రంగాలపై ఏవిధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామన్నారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు లోబడే అప్పలు చేస్తున్నామన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై రెండు రోజులు పాటు జరిగిన చర్చకు ముఖ్యమం త్రి కెసిఆర్ సమాధానం ఇచ్చారు. ఉన్న పరిమితులను వాడుకోవడం ద్వారా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల్లో లేని భయాందోళనలు సృష్టించవద్దని కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి అన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభ్యుదయ పథం ఎంచుకుందని, జపాన్, అమెరికా, చైనా మోడల్‌లో ముందు కు వెళ్తున్నామన్నారు. ప్రపంచంలో అమెరికా అందరికన్నా ఎక్కువ అప్పలు చేసిందని, జపాన్‌కు అప్పులు ఉన్నాయని అయినా అవి ప్రపంచాన్ని శాసిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ బాండ్స్‌కు ఇతర రాష్టాల్లో బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే రూ.69 వేల కోట్ల అప్పలు ఉన్నాయని, డిస్కాంలకున్న అప్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. మిషన్ భగీరథ పథకం తెచ్చి ఇంటింటికీ నీరిచ్చాం.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం.. వీటికి అప్పులు చేయడం ఎలా తప్పవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మిషన్ భగీరథ, నాణ్యమైన విద్యుత్, రహదారులు, గోడౌన్స్ నిర్మాణం, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ వంటి అనేక పథకాలు చేపట్టామని, ఇతర రాష్ట్రాలు, కేంద్రం కొనియాడుతోందన్నారు. మార్క్‌ఫెడ్, పౌరసరఫరాలు, ఆర్‌టిసిలకు గ్యారంటీ ఇవ్వడం కూడా తప్పుపడుతున్నారని, కొందరు అతి దుర్మార్గంగాస బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. తొందరలోనే అద్భుత ఫలితాలు కనబడుతాయని ఆయన తెలిపారు. మైనారిటీలకు బడ్జెట్ కేటాయింపులే గాకుండా ఆరోగ్యం, సిఎం రిలీఫ్ ఫండ్ వంటి ఇతర కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళ కాలంలో మైనారిటీలకు రూ.925 కోట్లు ఖర్చు చేస్తే 5 ఏళ్ళలో తమ ప్రభుత్వం రూ.3,994 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మైనారిటీ గురుకులాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రులు కొనియాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, టిఆర్‌ఎస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలు అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్‌రూం ఇళ్ళు కూడా నిర్మి ంచి ఇస్తామని పేర్కొన్నారు.