HomeNewsBreaking Newsఅపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా

20 తరువాత సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం
నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమావేశం
ప్రజాపక్షం / హైదరాబాద్‌: కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు ఆగస్టు 5వ తేదీని నిర్ణయించిందని, అయితే ఆ తేదీన ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలుండడం వల్ల అసౌకర్యంగా ఉంటుందని, దీంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20వ తేదీ తదనంతరం సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారం కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పవలసిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం నిర్ణయాలు, తీర్మానాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉన్నదని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసిందని సిఎం కార్యాలయం తెలియజేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సాంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సమావేశంలో పలువురు అభిప్రాయ పడ్డారని తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలని, వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సిఎంఒ తెలియజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందు నుంచీ నెలకొని ఉన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్‌ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతుందన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టిన తీరును సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తున్నదని, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సమావేశం అభిప్రాయపడిందన్నారు. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని సమావేశంలో ఆవేదన వ్యక్తమైందని సిఎంఒ వివరించింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిపింది.
గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా రాజీలేని వైఖరిని అనుసరించాలి
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకుని తీరాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంత టి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది. గోదావరి, కృష్ణా జలాల్లో మన రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సా గాలని, సమావేశం బలంగా అభిప్రాయ పడిందని సిఎంఒ ఆ ప్రకటనలో వివరించింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాలను లెక్క చేయకుండా ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్‌.కె.జోషి, సిఎంఒ ఉన్నతాధికారులు నర్సింగ్‌ రావు, స్మితా సభర్వాల్‌, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సిఎం ఒఎస్‌డి శ్రీధర్‌ దేశ్‌పాండే, రిటైర్డ్‌ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సిఇలు నాగేందర్‌ రావు, నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్‌రావు తదితరులు పాల్గొన్న సమావేశం నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించిందని సిఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments