అంజుమ్‌కు రెండో ర్యాంక్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో మెరిసిన భారత మహిళా షూటర్లు
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో భారత మహిళా షూటర్లు మెరిసారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటింగ్ స్టార్ అపూర్వి చండేలా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. మరోవైపు మరో భారత క్రీడాకారిణి అంజుమ్ మౌద్గిల్ అదే విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. కొద్ది సంవత్సరాలుగా నిలకడైన ఆటతీరు కనబరుస్తున్న వీరిద్దరు బుధవారం ఈ ఘనత సాధించారు. ట్విటర్ వేదికగా చండేలా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నా షూటింగ్ కెరీర్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ మైలురాయి చేరుకున్నాను’ అని ట్వీట్ చేసింది. అపూర్తి అద్భుతమైన ప్రదర్శనలతో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత్ షూటర్లలో చండేలా తన పేరును ఇప్పటికే ఖాయం చేసుకుంది. భారత్ నుంచి ఇప్పటివకరు టోక్యో ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత షూటర్లు తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. అందులో అపూర్వి చండేలా కూడా ఉంది. ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్‌లో అపూర్వి రికార్డు స్థాయిలో (252.9) పాయింట్లను సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అంతే కాకుండా 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం, గోల్డ్‌కాస్ట్ కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బీజింగ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ పోటీల్లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు అంజుమ్ మౌద్గిల్ బీజింగ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్న అంజుమ్ మౌద్గిల్ కూడా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకును సొంతం చేసుకుంది.
అపూర్విచండేలా వరల్డ్ నంబర్-1
RELATED ARTICLES