HomeNewsBreaking Newsఅపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యం

అపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యం

అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను, మద్దతిచ్చిన కమ్యూనిస్టులను, గెలిపించిన ప్రజలను మోసం చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలి
ఎనిమిదేళ్ళలో అన్ని రంగాలలో విఫలమైన ప్రధాని మోడీ ఇంకా కొనసాగుతుండడం సిగ్గుచేటు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
దేశానికి ప్రథమ శతృవైన బిజెపిని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చా రు. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకుని గెలవచ్చనే ధీమాతో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మునుగోడు నియోజకవర్గంలో బిజెపి ఉప ఎన్నిక తీసుకువచ్చిందన్నారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గతం లో తనను గెలిపించిన ఓటర్లను, ఆయన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చిన పార్టీని, ఎన్నికల్లో మద్దతిచ్చిన కమ్యూనిస్టు పార్టీని మోసం చేశారని విమర్శించారు. ఒక పార్టీలో ఉంటూ మరోక పార్టీ నుండి పోటీ చేస్తున్న తన తమ్మునికి ఓటు వేయాలని చెబుతున్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది ఏమి నైతికత అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మోసగాళ్ళు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన తమ్మునికి ప్రచారం చేయాలనుకుంటే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌, ఇ.టి.నర్సింహా, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్యలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. బ్రిటీష్‌ దేశానికి భారతీయ మూలాలు కలిగిన రుషీ సునాక్‌ ప్రధాని అవుతుండడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న లిజ్‌ ట్రస్‌ తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చనందుకు 45 రోజుల్లోనే రాజీనామా చేశారని, కానీ ఎనిమిదేళ్ళలో అన్ని రంగాలలో విఫలమైన ప్రధాని మోడీ ఇంకా కొనసాగుతున్నారని విమర్శించారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, శ్రీలంకను మించిన దుర్భర ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో నెలకొని ఉన్నాయన్నారు. అయినప్పటికీ మందిర్‌, మసీదు అంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారని చెప్పారు. బ్రిటన్‌ పార్లమెంటులో లిజ్‌ ట్రస్‌ రాజీనామా సందర్భంగా జరిగిన చర్చ అత్యంత హుందాగా సాగిందని కూనంనేని తెలిపారు. దురదృష్టవశాత్తు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారతదేశంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం అనే మాట లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల బిజెపికి సరిపడ ఎంఎల్‌ఎలు లేకున్నా ఇతర పార్టీ వారిని కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని, ఆ కోవలోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఓట్లు లేకపోయినా డబ్బు అధికారం ఉందనే అహంకారంతో బిజెపి ఇతర పార్టీల ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకువస్త్తోందని, తద్వారా రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యర్థులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. తాను నిజాయితీపరుడునని చెప్పుకునే ప్రధాని మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా బిజెపి అభ్యర్థిని పోటీ చేయించాలని సవాల్‌ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఆయన మూడేళ్ళ పాటు బిజెపితో అనుబంధం పెంచుకుని రూ.18వేల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని విమర్శించారు. అది టెండర్‌ల ద్వారా వచ్చిందని సమర్థించుకుంటున్నారని, బిజెపి ప్రభుత్వంలో పైవారి అండ లేకుండా ఏదీ సాధ్యం కాదని, ముంబై ఏయిర్‌ పోర్టును జిఎంఆర్‌ సంస్థను బెదిరించి ఎలా అదానీకి కట్టబెట్టారో అందరికీ తెలిసిందేనన్నారు. టిఆర్‌ఎస్‌ కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ, భారతదేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై దేశంలోనే గట్టిగా ప్రతిపక్ష సిఎం కెసిఆర్‌ గళం విప్పారని, అన్నీ బేరీజు వేసుకున్నాకే మునుగోడులో టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించిందని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ముస్లిం, క్రిస్టియన్‌ల తరువాత కమ్యూనిస్టులే తమ శతృవు అని బిజెపి చెబుతోందని, భావజాల, సైద్ధాంతిక పరంగా బిజెపి తమకు ప్రథమ శతృవు అని, ప్రజా వ్యతిరేక విధానాలు, దేశ ప్రజలను మత విద్వేషాలతో చీలుస్తున్న బిజెపి దేశానికే ప్రథమ శతృవు అని అన్నారు. మునుగోడులో బిజెపిని ఓడించి, టిఆర్‌ఎస్‌ ను గెలపించేందుకు తమ నాయకుడు పల్లా వెంకట్‌రెడ్డి సారథ్యంలో కమ్యూనిస్టులు మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఫిరాయింపు , ఎన్నికల్లో డబ్బును నిరోధించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్నికలో డబ్బు పంచే అభ్యర్థులను శాశ్వతంగా పోటీ చేయకుండా ఎన్నికల చట్టాల్లో మార్పులు తీసుకురావాలన్నారు.
ఐదు రెట్లు పెరిగిన విద్వేష ప్రసంగాలు : అజీజ్‌ పాషా
భారతదేశంలో 2014 నుండి 2019 వరకు విద్వేష ప్రసంగాలు 500 శాతం పెరిగినట్లు ఒక మీడియా సంస్థ సర్వేలో తేలిందని సయ్యద్‌ అజీజ్‌ పాషా తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని సరిచేసుకోవాలని, అలా జరిగితేనే మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం ఉన్నదన్నారు.
అమలుకాని ఎపి పునర్విభజన హామీలు : చాడ
ఎనిమిదేళ్ళలో ఎపి పునర్విభజన హామీలలో ఒక్కటి కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోడీ హయాంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి కారణమైన బిజెపి తెలంగాణలో పాగా వేసేందుకు మునుగోడును ప్రయోగశాలగా చేస్తోందన్నారు. వామపక్ష, అభ్యుదయ భావాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కలిగిన మునుగోడు ప్రజలు బిజెపి ఆటలు సాగనీయరన్నారు. ఉప ఎన్నికలో కేంద్ర బలగాలను దుర్వినియోగం చేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొడతారని ఆయన చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments