50 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి ఉండాల్సింది!
ఓటమిపై తేల్చిన బిజెపి కోర్‌కమిటీ
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 50 స్థానాల్లో పోటీ చేస్తే బాగుండేదని, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఏ నియోజకవర్గంలో పార్టీ సరైన విధంగా పని చేయలేకపోయిందని బిజెపి జాతీయ నాయకులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నదని వారు పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సోమవారం సికింద్రాబాద్‌లో సమావేశమైంది. పార్టీ దారుణంగా దెబ్బతినటానికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. సమావేశానికి కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జె.పి.నడ్డా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీమంత్రి, ఎంపి బండారు దత్తాత్రేయ, సీనియర్ నాయకులు జి.కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.