ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ
కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ
ఎంఎల్‌సి ఆశావహులకు నిరాశ
ప్రజాపక్షం/హైదరాబాద్
ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికలకు ఇది అనుకూలమైన సమయం కాదని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంఎల్‌ఎల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎంఎల్‌ఎసి స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విష యం తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిం ది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పం దిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది సరైన సమయం కాదని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 600లకు పైగా నమోదవుతున్నాయని, మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సబబు కాదని రాష్ట్ర ప్రభు త్వం సమాధానం చెప్పినట్టు సమాచారం. కాగా ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్ నుంచి ఎంఎల్‌సిలుగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం జూన్ 3వ తేదీన ముగిసింది. ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు 2015 జూన్ 4న ఎన్నికయ్యారు. కె.యాదవరెడ్డిని అనర్హునిగా ప్రకటించడంతో ఆయన స్థానంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టు 19న ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఫరీదుద్దీన్‌ను ఎన్నుకున్నారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన తెలంగాణ భవన్ ఇన్‌చార్జ్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఎంఎల్‌సి పదవీ కాలం జూన్ 16 నాటికి ముగిసింది.
ఎంఎల్‌సి ఆశావహులకు నిరాశ
ప్రభుత్వ నిర్ణయంతో శాసనసభ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని ఎదురు చూస్తున్న టిఆర్‌ఎస్ ఆశావహులకు నిరాశే మిగిలింది. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఇప్పటికే ఎంఎల్‌సి పదవులపై పలువురికి హామీ ఇచ్చినట్లు టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత కోటిరెడ్డిని ఎంఎల్‌సిని చేస్తానని స్వయంగా బహిరంగ సభలోనే కెసిఆర్ ప్రకటించారు. సుఖేందర్‌రెడ్డిని కొనసాగిస్తే సామాజిక సమీకరణాల్లో కోటిరెడ్డికి అవకాశం ఇస్తారా..? వేచి చూస్తారా..? అని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక, పద్మశాలీలకు ఎంఎల్‌సి పదవి ఇస్తామని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కెసిఆర్ హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఎంఎల్‌సి ఖాయమని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఒకే జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు మరేదైనా పదవి దక్కొచ్చని నేతలు అంటున్నారు. పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, మాజీ ఎంఎల్‌ఎ పాయం వెంకటేశ్వర్లు, దేశపతి శ్రీనివాస్ పేర్లు ఎంఎల్‌సి పదవుల ప్రచారంలో ఉన్నాయి. అందరూ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన ఎల్.రమణకు ఎంఎల్‌సి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల సంఖ్యాబలం దృష్ట్యా అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం లాంఛనమే కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అనువైన సమయం కాదు
RELATED ARTICLES