HomeNewsLatest Newsఅనాథలను చేయం

అనాథలను చేయం

మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దు

  • ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదే
  • మూసీ రివర్‌బెడ్‌, బఫర్‌జోన్‌లో ఉన్నవారిని ఆదుకుంటాం
  • రెచ్చగొట్టేవారి మాటలు నమ్మొద్దు
  • కాలకేయ ముఠాలా అడ్డుపడడం సరికాదు మూసీ ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలివ్వండి
  • ‘కాకా’ 95వ జయంతి వేడుకల్లో సిఎం రేవంత్‌ రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌
“మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశం.పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం& ముందుకు రండి. బిజెపి నేత ఈటల, బిఆర్‌ఎస్‌ నేతలు కెటిఆర్‌, హరీష్‌కు సూచన చేస్తున్నా. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డంవెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలు శనివారం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎం రేవంత్‌ రెడ్డి హాజరు కాగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపిలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంఎల్‌ఎలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌, ప్రేమ్‌ సాగర్‌రావు, నాగరాజు, ఎంఎల్‌సి ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు. సభలో సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ “మూసీ ప్రక్షాళనతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు. ప్రభుత్వం మిమ్ములను అనాథలను చేయదు. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు. ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది.ఫామ్‌ హౌస్‌లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దు. మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కెసిఆర్‌, కెటిఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్‌ హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. మీరు ఫామ్‌ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అవసరమైతే మలక్‌పేట్‌ రేస్‌ కోర్టును, అంబర్‌పేట్‌ పోలీస్‌ ఆకాడమీని హైదరాబాద్‌ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దాం” అని అన్నారు. బిఆర్‌ఎస్‌ నేతలు కెటిఆర్‌, హరీష్‌ రావు, బిజెపి నేత ఈటలకు ఫాంహౌస్‌లను కాపాడుకునేందుకు వారికి ఉన్న శ్రద్ధ మూసీ పరివాహక ప్రాంత వాసులపైలేదని విమర్శించారు. సోషల్‌ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారని, సోషల్‌ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అని సిఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని అన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాకాను కాంగ్రెస్‌ పార్టీ కోణంలో చూశారో లేక ఆయనను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదు కానీ ఆయన జయంతిని అధికారికంగా మాత్రం నిర్వహించకపోవడం విచారకరమన్నారు. కాకా జయంతితో పాటు వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియా గాంధీని ఒప్పించారన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించడం బిఆర్‌ఎస్‌ కుటిల నీతికి నిదర్శనమన్నారు. కాకా ఆశయాలను కొనసాగించాల్సిన కాంగ్రెస్‌పై బాధ్యత అందరిపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన అన్నారు.
పెద్దపల్లిలో కాకా విగ్రహం పెట్టడం సముచితం: చాడ వెంకట్‌ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కరించడంలో అగ్రభాగాన నిలిచిన గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని పెద్దపల్లిలో పెట్టడం సముచితంగా ఉంటుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. బడుగు, బలహీనవర్గాల నివాసం కోసం హైదరాబాద్‌లో గుడిసెలు వేయించి అనేక పోరాటాలు చేసి ఆ ఇళ్లు వారికే దక్కేలా చూశారని, వెంకటస్వామి ఉద్యమం ఎప్పటికీ మరువలేమన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలే ప్రజల బాగోగులు చూసేవని, వెంకటస్వామి కార్మిక నాయకుడిగా అనేక పరిశ్రమల్లో సంఘాలు పెట్టి కార్మిక పక్షంగా నిలబడ్డారన్నారు. కమ్యూనిస్టు నేతలు మగ్దూం మెహియొద్దీన్‌, కెఎల్‌.మహేంద్ర, సత్యనారాయణ రెడ్డితో కలిసి కార్మికులకు అనేక హక్కులు సాధించడంలో దిట్టగా పేరు సంపాదించారన్నారు. ఆనాటి విలువలు, అంకిత భావం, వారి సేవా భావం ఎలా ఉందో కార్మిక యూనియన్లుగా కలిసి పోవడంలోనే అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ కాకా పాత్ర అనిర్వచనీయమైనదన్నారు. రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాకా కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కూడా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారన్నారు. వెంకట్‌స్వామి కేంత్ర మంత్రిగా ఉంటూ సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకున్నారని, అది ఐఎన్‌టియుసి, ఎఐటియుసి పోరాటాల వల్ల సాధ్యమైందన్నారు.
కాకా డాక్యుమెంటరీ వస్తే బావుంటుంది : కోదండరామ్‌
కాకా అంబేద్కర్‌ వారసుడిగా అణగారిన వర్గాల పక్షంగా నిలిచేవారని ఎంఎల్‌సి ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ అన్నారు. సోషలిస్టుభావాలు ఉన్న ఆయన ప్రతి నిత్యం కార్మిక, కర్షకుల శ్రేయస్సు కోసమే పరితపించేవారన్నారు. వారి జీవిత చరిత్ర పుస్తకంగా వచ్చిందని, దానిని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. అంతే కాకుండా ఆయన జీవిత చరిత్రను డాక్యుమెంటరీగా కూడా తీస్తే మరింత మందిలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఎంపిలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో పని చేయాలని కాకా సూచించే వారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments