స్పీకర్‌కు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి
26 నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర
ప్రజాపక్షం / బాన్సువాడ/ హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై తక్షణమే చర్య లు తీసుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం బాన్సువాడకు వెళ్లి మరీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. శాసనమండలి మాజీ ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ, మాజీ ఎంఎల్‌ఎ ఈరవత్రి అనిల్‌తో కలిసి స్పీకర్‌కు పిటిషన్‌ను భట్టి అందజేశారు. ఇటీవల ఎంఎల్‌ఎలు చిరుమర్తి లింగయ్య తదితరులు త్వరలో టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో సిఎల్‌పి విలీనం జరుగుతుందన్నారని, దాని ఆధారంగా కూడా ఫిరాయించిన ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఇచ్చిన లేఖలో కోరారు. అలాగే ఒకవేళ విలీనం గురించి ఏదైనా ప్రతిపాదన వస్తే ముందు తమకు నోటీసు ఇవ్వాలని, అంతకంటే ముందే అనర్హత పిటిషన్‌లపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశా రు. అనంతరం స్పీకర్ ఇంటి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎంఎల్‌ఏల్లో ఆరుగురు ఎంఎల్‌ఏలను డిస్ క్వాలిఫై చేయాలని గతంలో పిటీషన్ ఇచ్చామని, అలాగే హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జాలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టపగలే ఖూనీ చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు.అనేక ప్రలోభాలకు గురిచేసి.. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరినట్లు ఆయన చెప్పారు. అందుకు సంబంధించి పదో షెడ్యూల్ వివరాలను, అఫిడవిట్ ను స్పీకర్ కు అందించినట్లు భట్టి వివరించారు. స్పీకర్ హైదరాబాద్ లో లేకపోవడం వల్ల వారి నివాసం అయిన బాన్స్ వాడలో ఆయనను కలసి ఇచ్చామని అన్నారు.