ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కర్నాటక రెబల్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ/ బెంగళూరు: కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎంఎల్‌ఎల పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ కెఆర్ రమేశ్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది. కేసుకు సంబంధించిన నిజానిజాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెల్లడించామని, అనర్హత విషయంలో స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. అయితే అనర్హత ఎంఎల్‌ఎలు వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చని.. గెలిచిన వారు మంత్రి పదవులు కూడా చేపట్టవచ్చని ముగ్గురు న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అనర్హత అంశంపై ఎంఎల్‌ఎలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. కర్ణాటకలో డిసెంబరు 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో 17 అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండగా, 15 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 18 తేదీల మధ్య తమ నామినేషన్ పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా కోర్టు తీర్పును అనర్హతకు గురైన ఎంఎల్‌ఎలు స్వాగతించారు. ఈ ఏడాది జులైలో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కూటమికి చెందిన కొందరు ఎంఎల్‌ఎలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వ కుప్పకూలింది. దీంతో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ కూటమికి చెందిన 17 మంది ఎంఎల్‌ఎలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. వారిలో 14 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కాగా, ముగ్గురు జెడి(ఎస్) ఎంఎల్‌ఎలు. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వంపై జులై 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకముందే వారిపై అనర్హత వేటు పడింది. కర్నాటక స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించడమేగాక.. కర్ణాటక 15వ అసెంబ్లీ ముగిసే వరకు… అంటే 2023 దాకా ఆ ఎంఎల్‌ఎలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అనర్హతకు గురైన ఎంఎల్‌ఎలు వీరు: ప్రతాప్ గౌడ పాటిల్, బిసి పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్‌టి సోమశేఖర్, బైరతి బసవరాజ్, ఆనంద్ సింగ్, ఆర్ రోషన్ బేగ్, ఎన్ మునిరత్న, కె సుధాకర్, ఎంటిబి నాగరాజ్, శ్రీమంత్ పాటిల్, రమేశ్ జర్ఖీహోలి, మహేశ్ కుమటల్లి, ఆర్ శంకర్(వీరంతా కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు), ఇక అనరతకు గురైన జెడిఎస్ ఎంఎల్‌ఎలు.. కె గోపాలయ్య, ఎహెచ్ విశ్వనాథ్, కెసి నారాయణ గౌడ ఉన్నారు. దీంతో అనర్హతకు గురైన 17 మంది ఎంఎల్‌ఎలు విడతల వారీగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంఎల్‌ఎల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గత అక్టోబరు 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా అనర్హతపై స్పీకర్ నిర్ణయం సరైందేనంటూ తీర్పు వెల్లడించింది. అయితే వారు ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చని కూడా స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో స్పీకర్ రమేశ్ కుమార్ కూడా నిమ్మదించారు. స్పీకర్ కెఆర్ రమేశ్ కుమార్ ఉత్తర్వులోని కొంత భాగాన్ని కోర్టు కొట్టేయడంతో ఇప్పుడు అందరి దృష్టి బిజెపి తదుపరి ఎత్తుగడ మీద ఉంది. అనర్హత వేటు పడిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎంఎల్‌ఎలకు బిజెపి టికెట్లు ఇస్తుందా అని అందరూ గమనిస్తున్నారు. కోర్టు తీర్పును కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప స్వాగతించారు. అదంతా స్పీకర్ రమేశ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య కుట్రగా పేర్కొన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో మొత్తం 15 సీట్లను బిజెపి గెలుచుకుంటుందన్న ధీమాను యెడియూరప్ప వ్యక్తం చేశారు. అంతేకాక అనర్హతకు గురైన ఎంఎల్‌ఎలకు టికెట్లు ఇచ్చే నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుందన్నారు.
బిజెపిలో చేరనున్న అనర్హత ఎంఎల్‌ఎలు: ఉపముఖ్యమంత్రి
బెంగళూరులో గురువారం అనర్హత వేటుకు గురైన ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరుతారని ఉపముఖ్యమంత్రి సిఎన్ అశ్వథ్‌నారాయణ్ అన్నారు. ‘వారు కూడా బిజెపిలో చేరడానికి ఆసక్తిని వెల్లిబుచ్చారు’ అని కూడా ఆయన విలేకరులకు తెలిపారు. 15 సీట్లకు డిసెంబర్ 5న కర్నాటక ఉప ఎన్నిక జరగనుంది. తీర్పు వెలువడ్డాక కొంత మంది అనర్హత ఎంఎల్‌ఎలు అశ్వథ్‌నారాయణ్‌తో కలిసి న్యూఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. అనర్హత ఎంఎల్‌ఎలు గురువారం ముఖ్యమంత్రిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కలిసి తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారని అశ్వథ్‌నారాయణ్ విలేకరులకు తెలిపారు. ‘వారు పార్టీలో చేరాలనుకుంటే ఇబ్బందులు, సమస్యలు అంటూ ఏమీ లేవు’ అని కూడా చెప్పారు. వారు సంతోషంగా, పూర్తి నమ్మకంతో బిజెపిలో చేరాలనుకుంటున్నారని కూడా తెలిపారు. ‘వారికే లేని సందేహాలు మీ మీడియా వాళ్ళకు ఎందుకు’ అని కూడా అశ్వథ్‌నారాయణ్ అన్నారు.
అనర్హత విధింపు సరైనదే
RELATED ARTICLES