ఎంఎల్‌ఎలపై స్పీకర్ అనర్హత వేటువేసే అధికారంపై పార్లమెంటు పునరాలోచించాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శాసనకర్తలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలను పునరాలోచించాలని సుప్రీంకోర్టు మంగళవారం పార్లమెంటును ఆదేశించింది. ఇదే సమయంలో స్పీకర్ కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తేనని గుర్తించాలని పేర్కొంది. బిజెపి ఎంఎల్‌ఎ, మణిపూర్ అటవీశాఖ మంత్రి తౌనాజోమ్ శ్యాంకుమార్ సింగ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు కోరిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఎంఎల్‌ఎల అనర్హత వేటు నిర్ణయంపై స్వతంత్ర యంత్రాంగంను రూపొందించాలని సూచించింది. బిజెపి మంత్రి అనర్హత అభ్యర్థనపై నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఫజూర్ రహీమ్, కె.మేఘాచంద్రకు ఉన్నాయని న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. విషయమేమిటంటే…బిజెపి మంత్రి కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత బిజెపిలో చేరి మంత్రి అయ్యాడు. దాంతో అతడిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలుచేసింది. ఇదిలావుండగా స్పీకర్ కూడా ఓ పార్టీకి చెందిన వ్యక్తే అయినందున ఓ ఎంఎల్‌ఎపై అనర్హత వేటువేసే ఆయన అధికారంపై పునరాలోచించాలని పార్లమెంటును సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.