ప్రశ్నించడాన్ని మానుకోను
ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతూనే ఉంటా
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తన లోక్‌సభ సభ్యత్వంపై పడిన అనర్హత వేటు గురించి భయపడేది లేదని, ఒకవేళ తన ను శాశ్వతంగా పార్లమెంటు నుంచి బహిష్కరించినా లేదా జైల్లో పెట్టినా.. ప్రశ్నించడాన్ని మాత్రం మానుకునేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షంకు తాను పోరాడుతునే ఉంటానని చెప్పారు. ప్రజాస్వామ్యంపై దాడి గురించి గతంలో తాను చెప్పిన విషయం ఇప్పుడు కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నదని శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. అదానీకి, ప్రధాని మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించానని, ఇక ముందు కూడా ఈ విధంగా ప్రశ్నిస్తునే ఉంటానని చెప్పారు. ఆ సంస్థలోకి 20,00 కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందని మరోసారి కేంద్రాన్ని నిలదీశారు. అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొంత మంది మంత్రులు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అనర్హత వేటు కూడా కేంద్రంలోని బిజెపి సర్కారు కుట్రలో భాగమేనని రాహుల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడమే తన లక్ష్యమని, పార్లమెంటు నుంచి శాశ్వతంగా బహిష్కరించినా, జైల్లోకి నెట్టినా తాను భయపడేది లేదని అన్నారు. నిజానికి అదానీ కుంభకోణంపై తాను ఏం మాట్లాడతానోనన్న భయం ప్రధాని మోడీ కళ్లలో కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తనకు మద్దతునిస్తున్న అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నా పేరు గాంధీ.. సావర్కర్ కాదు..
క్షమాపణ కోరే ప్రసక్తే లేదు
‘నా పేరు గాంధీ.. సావర్కర్ కాదు. గాంధీ ఎవరికీ క్షమాపణ చెప్పడు. చెప్పబోడు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సర్కారు పలు సందర్భాల్లో క్షమాపణలు కోరిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు రాహుల్ ఈ విధంగా స్పందించారు. తాను దేశ గౌరవానికి, సార్వభౌమత్వానికి భంగం కలిగేలా ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు భారత ప్రజస్వామ్యంపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకుగాను ఆయన క్షమాపణ చెప్పాలని పార్లమెంటులో బిజెపి సభ్యులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. కానీ, తాను దేశాన్ని ఎన్నడూ కించపరచలేదని రాహుల్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతో బిజెపి అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలావుంటే, సావర్కర్ జైల్లో ఉన్నప్పుడు తనను క్షమించి విడుదల చేయాలంటూ బ్రిటిషర్లకు లేఖ రాశారని రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బ్రిటిషన్ల ముందు మోకరిల్లిన సావర్కర్ దేశభక్తులు ఎలా అవుతాడని రాహుల్ అప్పట్లో ప్రశ్నించారు. క్షమాపణ విషయంలో ఇప్పుడు సావర్కర్ ప్రస్తావనను తీసుకురావడం ద్వారా గతంలో చేసిన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.