బిజెపి, టిఆర్‌ఎస్‌పై సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శ
ప్రజాపక్షం/హైదారబాద్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంలో బిజెపి,టిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని, ఈ విషయం లో ఆ రెండు పార్టీలకు నార్కో టెస్ట్ చేయించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విజయోత్సవాలపై బిజెపి మాట్లాడే ముందు ఆ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలను గుర్తించి, పెన్షన్ మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరంగా ,హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బిజెపి తప్పుగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. టిఆర్‌ఎస్ కూడా అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం లేదని గుర్తుచేశారు.
మోడీ వ్యతిరేక పోరాటంలో కలిసిరావాలి
మోడీ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని టిఆర్‌ఎస్, టిడిపిని నారాయణ కోరారు. వచ్చే అక్టోబర్ 3 నుంచి 4వ తేదీ వరకు న్యూఢిల్లీలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ మహాసభను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోడీ ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదని, మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 19 రాజకీయ పార్టీలు ఈ నెల 27న భారత్‌బంద్‌కు ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బిజెపి, టిఆర్‌ఎస్ డబుల్ గేమ్ : చాడ వెంకట్ రెడ్డి
బిజెపి, టిఆర్‌ఎస్‌లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన బంద్‌లో పాల్గొన్న టిఆర్‌ఎస్ ఆ తర్వాత యూ టర్న్ తీసుకుందన్నారు. ఈనెల 17న అధికారికంగా వేడుకలు నిర్వహించాన్న సిఎం కెసిఆర్ ఇప్పుడు మౌనంగా ఉండడానికి ఎంఐఎంతో దోస్తీనే కారణమని విమర్శించారు. ఈనెల 11నుంచి 17వరకు తెలంగాణ సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పెద్ద వ్యాపార వర్గాలకు అనుకూలంగా పని చేస్తుందని 46 శాతం భావిస్తున్నట్టు సర్వేలో తేలిందన్నారు.
అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాటంపై చిత్తశుద్ధి లేదు
RELATED ARTICLES