HomeNewsBreaking Newsఅధికారికంగా కొమరయ్య జయంతి?

అధికారికంగా కొమరయ్య జయంతి?

గొల్ల కురుమల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది
సదర్‌ పండుగ జరిపే కోరికనూ నెరవేరుస్తాం
మంత్రి కెటిఆర్‌ హామీ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.టి. రామారావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలనే గొల్ల కురుమల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని, సదర్‌ పండుగను అధికారికంగా జరిపే కోరికనూ నెరవేరుస్తామని కెటిఆర్‌ హామీనిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన యాదవ-కురమ సభలో మంత్రి కెటిఆర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి, కులవృత్తికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేదని, తెలంగాణ వచ్చాక ఎలా బాగా అయిందో ఒకసారి ఆలోచించాలన్నారు. తెలంగాణ రాకముందు 2 లక్షల 21 వేల మంది మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో సభ్యులుగా ఉండేదన్నారు. ఈరోజు ఆ సంఖ్య 7 లక్షల 61 వేలకు పెరిగిన పెరిగిన సంగతి నిజ మా, కాదా అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు 11 వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ పథకాలు నెంబర్‌వన్‌గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్‌ సింగ్‌ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రశంసించారని తెలిపారు. బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏమిటో మనకు అర్థం కావడం లేదన్నారు. గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నది వాస్తవమన్నారు. పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదని, తాతలనాటి కులవృత్తులు బాగుంటే దేశం కూడా బాగుంటుందనేది సిఎం ఆలోచన అన్నారు.
కెసిఆర్‌కు గొల్ల కురమలు మద్దతుగా నిలవాలి : మంత్రి హరీశ్‌ రావు
ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమ జాతి అని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నాడు న్యాయం, ధర్మం పాండవుల వైపు ఉన్నందునే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడని చెప్పారు. గతంలో ఏ సిఎం చేయని విధంగా సిఎం కెసిఆర్‌ గొల్ల కురమలను అభివృద్ధి చేశారని, వారిని ఆర్థికంగా నిలబెట్టారన్నారు. గొల్ల కురమలలో ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులకంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని గతంలో అసెంబ్లీలో సిఎం చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గొల్ల కురమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సిఎం కెసిఆర్‌ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. కర్ణాటకలో అప్పటి మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రేవణ్ణ గొర్రెల స్కీమ్‌ గురించి తెలిసుకుని సిఎం కెసిఆర్‌ను అభినందించారని, హైదరాబాద్‌కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించాడని హరీశ్‌ రావు గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నోటీసులు ఇచ్చినా రేవణ్ణ భయపడలేదన్నారు. కురమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమవుతున్నాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం పెడితే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయని, అయినా ఇప్పటివరకు తాము 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేశామని ఆయన తెలిపారు. గొల్ల కురమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయిస్తే, ఆ డబ్బులు చేతికి రావని, సీజ్‌ అవుతయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయన్నారు. కానీ, వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పటిలాగే మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జనం కోసం చేసిందేమీ లేదన్నారు. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200కు పెంచిందన్నారు. రైతులకు బావులవద్ద, బోర్లకాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరిస్తే రాష్ట్రానికి ఏడాదికి ఆరు వేల కోట్ల లెక్కన ఐదేళ్లకు 30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని హరీశ్‌ రావు తెలిపారు. కానీ సిఎం కెసిఆర్‌ తన ప్రాణం పోయినా మీటర్లు పెట్టనిచ్చేది లేదని తెగేసి చెప్పిండన్నారు. మునుగోడులో ఓట్ల కోసం పూటకోమాట మాట్లాడే జూటాగాళ్లు వస్తున్నరని, జూటేబాజ్‌ గాళ్లకు ఓటర్లు బుద్ది చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments