‘ధరణి’ ప్రారంభించిన లక్ష్మాపూర్‌లోనే రైతులకు పాస్‌పుస్తకాలు లేవు
కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తా : రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/శామీర్‌పేట ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఆ హామీని మరిచిపోయారని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్ జైలు ఊచలు లెక్కించాల్సిందేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన కుటుంబానికి చర్లపల్లిలో జైల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తప్పకుండా కట్టిస్తానన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో గతంలో రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పొయిన కుమ్మరి ఎల్లమ్మకు కాంగ్రెస్ పార్టీ ఇళ్లు కట్టించింది. శుక్రవారం నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గ్రామ ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మూడుచింతలపల్లి మండలంలో ధరణి ప్రారంభించినప్పటికీ పక్క గ్రామమైన లక్ష్మాపూర్ రైతులకు ఇప్పటివరకు పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వలేదని, దీంతో రైతులు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు కట్టించాలని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినా ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. కార్పొరేట్‌కు దీటుగా నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించే విధంగా రూ. 5 లక్షలు అందిస్తామని చెప్పారు. గ్యాస్ ధర అమాంతం పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 500కే సిలిండర్ అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షలు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మహిళలను, యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హారివర్దన్‌రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్‌యాదవ్, మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహ్మ యాదవ్, వైస్ ఎంపిపి మంద శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ వైద్యనాథ్, సీనియర్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
అధికారంలోకి వస్తేఅందరికీ ఇందిరమ్మ ఇళ్లు
RELATED ARTICLES