మూడు నెలలపాటు అద్దె వసూలు వాయిదా
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో అద్దె ఇళ్లలో ఉండేవారికి తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. మార్చి నుంచి మూడు నెలల పాటు ఇళ్ల అద్దెను వసూలు చేయరాదని గృహ యజమానులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 38(2), ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897ల ప్రకారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె బకాయిలను మూడు నెలల తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మూడు నెలల అద్దె బకాయిలకు యజమానులు ఎలాంటి వడ్డీని వసూలు చేయరాదని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇంటి యజమానులు మూడు నెలల పాటు అద్దె వసూలు చేయరాదని గతవారం జరిగిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని ఆయన ఇళ్ల యజమానులను కోరారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా రెండవసారి మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించగా, రాష్ట్రంలో మాత్రం 7వ తేదీ వరకు కొనసాగనుంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.