శ్రీలంకలో బాంబుపేలుళ్లకు పాల్పడింది తామేనని వెల్లడించిన ఐసిస్
321కి చేరిన మృతులు
అందులో పది మంది భారతీయులే
40 మంది అనుమానితులు అరెస్ట్
మంగళవారం శోకదినం పాటించిన శ్రీలంక
న్యూజిలాండ్ ఘటనకు ప్రతీకారదాడులేనన్న మంత్రి
కొలంబో: శ్రీలంకలోని చర్చిల్లో, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య తాజాగా 321కి పెరిగింది. ఇదిలావుండగా ఆదివారం జరిగిన ఘోరానికి తామే కారణమని ఐసిస్ ప్రకటించింది. న్యూజిలాండ్ మసీదులో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ దాడులు జరిపి ఉంటారని సీనియర్ మంత్రి ఒకరు మంగళవారం శ్రీలంక పార్లమెంటుకు తెలిపారు. శ్రీ లంక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి బాంబర్లు వాడుకున్న వ్యాన్ డ్రయివర్ సహా 40 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా శ్రీలంకలో మంగళవారం శోక దినాన్ని పాటించారు. జాతీయ పతాకాలను సగం మేరకు అవనతం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు ప్రజలు మూడు నిమిషాలపాటు తలలు వంచి మౌనాన్ని పాటించారు. కాగా, శ్రీలంకలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తామే కారణమంటూ ఐసిస్ తన ప్రచార వార్తా సంస్థ ‘అమఖ్’ ద్వారా ప్రకటించింది. దాడుల వెనుక నేషనల్ తవ్‌హీద్ జమాత్(ఎన్‌టిజె) అనే ఇస్లామీయ తీవ్రవాద గ్రూపు హస్తం ఉందని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం నాటికి మృతుల సం ఖ్య 321కి పెరిగింది. దాడుల్లో చనిపోయిన 38 మంది విదేశీయుల్లో 10 మంది భారతీయులు ఉన్నారు. తాజాగా ఇద్దరు భారతీయులు… ఎ. మారెగౌడ, హెచ్. పుట్టరాజు మరణించడంతో భారతీయ మృతుల సంఖ్య 10కి పెరిగింది.