కేరళ పరిణామాలపై సురవరం సుధాకరరెడ్డి
ప్రజాపక్షం/ హైదరాబాద్ : దేవాలయంలో మహిళల ప్రవేశంపై కోర్టు తీర్పును మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తే లేని తప్పు, కేరళలో వామపక్ష ప్రభుత్వం చేస్తే ఎందుకు అభ్యంతరమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేరళలో శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశంపై జరుగుతున్న పరిణామాల వెనుక మోడీ ప్రభుత్వ హస్తం వుంద ని, ఇది కేవలం బిజెపి,- ఆర్‌ఎస్‌ఎస్‌ల పొలిటికల్ స్టంట్ అని పేర్కొన్నారు. మహిళలకు వ్యతిరేకంగా కాలం చెల్లిన “మనుధర్మ” శాస్త్రాన్ని తిరిగి అమలు చేసేందుకు బిజెపి,-ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ మగ్ధుంభవన్‌లో శుక్రవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురవరం మాట్లాడారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంలో కోర్టు తీర్పునే కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. మహారాష్ట్రలోని శనేశ్వరాలయంలో, ముంబయిలోని ఒక దర్గాలో మహిళలు వెళ్లవచ్చని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అక్కడి బిజెపి ప్రభుత్వం అమ లు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము మతానికి వ్యతిరేకం కాదని, మతోన్మాద శక్తులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిజెపి-ఆర్, ఎస్‌ఎస్‌కు భగవంతునిపై విశ్వాసం, హిందూ సంస్కృతిపై నమ్మకం కంటే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు నైరాశ్య పోరాటం చేస్తుందని ఆయన వ్యాఖ్యా నించారు. శబరిమలలో మహిళల ప్రవేశం సాంప్రదాయానికి సంబంధించిన అం శమని సాక్షాత్తు ప్రధాని మోడీ చెప్పడంపై సురవరం అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యాలో నాటి కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్లు చర్చిలలో, ముస్లింలు మసీదులలో ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నారని గుర్తు చేశారు. ఒక దగ్గర క్రైస్తవులకు, మరో దగ్గర ముస్లింలకు, ఇంకో దగ్గర హిందూవులకు కమ్యూనిస్టులు వ్యతిరేకమని మతోన్మాద శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చెబుతాయన్నారు. అయితే తాము మతాలకు అతీతంగా ఉంటామన్నారు. 1958 నంబూద్రిపాద్ మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని శాంతిభద్రతల పేరుతో రద్దు చేశారని, తిరిగి అదే పద్ధతిలో కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై దాడికి దిగేందుకు బిజెపి నీచమైన ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పు, మహిళల సమానత్వానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్- ప్రయత్నిస్తోందన్నారు. ఎవరిని నమ్మించేందుకు తనకు ఫెడరల్ ఫ్రంట్ తెలియదని, మీడియాలో ఈ విషయంపై వచ్చే కథనాలు ఆయన దృష్టికి రాలేదా అని సురవరం ప్రశ్నించారు. ఇలాంటి చెత్త అబద్ధాల మోడీ దేశానికి ప్రధాని కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ నెల8-9న జాతీయ కార్మిక సంఘాల సమ్మెలో అన్ని వర్గాలూ పాల్గొనాలన్నా రు.ఇటీవల ఒక టీవీ ఛానల్‌లో మోడీ మాట్లాడారని, అందులోని ప్రశ్నలను కూడా ప్రధాని కార్యాలయం నుంచే తయారు చేశారేమోనని సురవరం ఆరోపించారు. రాఫెల్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయాల్సిందేనని సురవరం డిమాండ్ చేశారు.