పార్లమెంటులో నిలదీసిన ప్రతిపక్షం
పారిశ్రామికవేత్తకు రక్షణకల్పిస్తున్నారని
ప్రధాని మోడీపై ధ్వజం
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అక్రమ వ్యవహారాలు, ఆయనతో తనకుగల సన్నిహిత సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభకు సమాధానం చెప్పలేదని ప్రతిపక్షం నిలదీసింది. గదిలో ఏనుగును దాచిపెట్టి ఏమీలేదని ప్రధానమంత్రి బుకాయించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు బుధవారం సమాధానమిచ్చిన మోడీ ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాత్రం సమాధానాలు చెప్పలేదని ప్రతిపక్షాలు మోడీపై ప్రతి విమర్శలు చేశాయి. సంపన్నుడు, పారిశ్రామికవేత్త అదానీకి ప్రధానమంత్రి రక్షణ ఇస్తున్నారని, ఆయన తప్పులు దాచిపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశంలో కోట్లాదిమంది ప్రజలకు తనపై విశ్వాసం ఉన్నప్పుడు ప్రతిపక్షాల దూషణలు, వారి ఆరోపణలు తననేమీ చేయలేవని, ప్రజా విశ్వాసమే తనకు రక్షణ కవచంగా ఉంటుందని లోక్‌సభలో చెప్పడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీనిపై కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ, అదానీతోగల సాన్నిహిత్యం గురించి, అదానీకి ఆయన చేసిన మేలు గురించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోడీన లోక్‌సభలో సమాధానం దాటవేశారని, అస్సలు ఆ ఊసే ఆయన ఎత్తలేదని విమర్శించారు. మంగళవారం రాహుల్‌గాంధీ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో పాల్గొంటూ అదానీకి, మోడీకి గల సన్నిహిత సంబంధాలను ఆధారాలతో సహా రువు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విదేశీ పర్యటనలకు వెళ్ళిన ప్రతిసారీ అనేక దేశాల్లో ఆయన వ్యాపారాల అభివృద్ధికి అనుగుణంగా మేలు చేశారని, పలు దేశాల్లో కాంట్రాక్టులు అదానీకి రావడానికి మోడీయే కారణమని, ఒక వ్యక్తి శ్రేయస్సుకోసం విదేశాల్లో కృషి చేయడం, ఈ విధమైన పద్ధతి భారత విదేశాంగ విధానం కానేకాదని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు మోడీ తన ప్రసంగంలో ఎక్కడా సమాధానాలు చెప్పలేదని జైరామ్ రమేశ్ విమర్శించారు.మోడీ జవాబులు చెప్పకుండా దాటేశారని అన్నారు. లోక్‌సభలో టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, ఎస్‌బిఐ, ఎల్‌ఐసిలలో పేదల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని మోడీ ఎక్కడా చెప్పలేదని, ఆయన వెంటనే పేదలకు హామీ ఇవ్వాలని కోరారు. ‘మోడీ తన గదిలో ఏనుగును దాచిపెట్టుకున్నారని, ఆ సమస్యను మోడీ పరిష్కరించలేదని శిరోమణి అకాలీదళ్‌పార్టీ ఎంపి హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్ విమర్శించారు. సమాజ్‌వాదీపార్టీ ఎంపి జయాబచ్చన్, నరేంద్రమోడీ ఫోటోలను జైరామ్ రమేష్ ట్వీట్ చేస్తూ, రాజ్యసభలో ఒక నటి ఈ రోజు బ్రహ్మాండమైన ప్రసంగం చేస్తే, లోక్‌సభలో ఒక నటుడు ఈ రోజు మరింత బ్రహ్మాండమైన ప్రసంగం చేశారని వ్యగ్యాస్త్రాలు సంధించారు.
అదానీ వ్యవహారంపై సమాధానమేది?
RELATED ARTICLES