HomeNewsTelanganaఅతి సంపన్నులపై పన్ను

అతి సంపన్నులపై పన్ను

కొత్తగా సాధారణ సంపద, వారసత్వ ఆస్తి పన్ను
ఉపాధి హామీ బడ్జెట్‌ రెట్టింపు
సిపిఐ(ఎం) మ్యానిఫెస్టో విడుదల
ప్రజాపక్షం/హైదరాబాద్‌ బిజెపి, దాని మిత్రపక్షాలను ఓడించాలని,లోక్‌సభలో సిపిఐ(ఎం), వామపక్ష పార్టీల బలాన్ని పెంచాలని ప్రజలకు సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరింది. ఢిల్లీలోని సిపిఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌లో ఆ పార్టీ మ్యానిఫెస్టోను గురువారం నాడు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ , తపన్‌ సేన్‌, బృందా కారత్‌, నీలోత్పల్‌ బసులు విడుదల చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ) వంటి నిరంకుశ చట్టాలను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో సిపిఐ(ఎం) ప్రకటించింది. అతి సంపన్నుల (సూపర్‌ రిచ్‌)పై పన్ను వేస్తామని, సాధారణ సంపద పన్ను, వారసత్వ ఆస్తి పన్ను విధింపుపై కొత్త చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం బడ్జెట్‌ను రెట్టింపు చేస్తామని, పట్టణ ఉపాధి హామీ కోసం నూతన చట్టం చేస్తామని తెలిపింది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడుతామని, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని రద్దు చేస్తామని పేర్కొంది. మతాన్ని రాజకీయల నుండి వేరు చేయాలనే రాజీలేని సూత్రానికి కట్టుబడి ఉంటామని సిపిఐ(ఎం) స్పష్టం చేసింది. స్వతంత్ర వ్యవస్థల స్వయంప్రతిపత్తిని కాపాడుతామని, ప్రజల ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తామని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను పునఃపరిశీలిస్తామని, లేబర్‌ కోడ్‌ల స్థానంలో కార్మికుల అనుకూల చట్టాలను తీసుకుస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రాలకు రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తామని, కేంద్రం వసూలు చేసే పన్నులు, సర్‌ఛార్జ్‌ల మొత్తంలో రాష్ట్రాలకు 50 శాతం వాటా కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. జనాభా లెక్కల సందర్భంగా ఓబిసి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉన్నదని, మహిళలకు చట్ట సభల్లో మూడవ వంతు రిజర్వేషన్‌ కల్పించాలని కోరింది. ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న ఆశ్రిత పక్షపాత విధానాలు, మతతత్వం, కార్పొరేట్‌ల అనుబంధ విధానాలకు పూర్తి భిన్నమైన విధానాల కోసం కృషి చేస్తామ పేర్కొంది. త్వరలోనే మరింత విస్తారంగా ప్రత్యామ్నాయ విధానాలతో మ్యానిఫెస్టో రెండవ భాగాన్ని తీసుకువస్తామని తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments