నాగార్జునాసాగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుంటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కొడుకు మృతి
యాదాద్రి జిల్లాలో ఆర్‌టిసి బస్సు బోల్తా : ఇద్దరు దుర్మరణం
ప్రజాపక్షం/చింతపల్లి తాము చదివిన సర్టిఫికెట్‌ల కోసం వెళ్లి తిరిగి కారులో వస్తుండగా మృత్యువు మాటు వేసింది. అదే సందర్భంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం పాలిట కారు మృత్యుశకటంగా మా రింది. అతి వేగం ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఘటన నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ పై ప్రయాణిస్తున్న తల్లి, తండ్రి, కొడుకు మృతి చెందిన హృదయవిదారక సంఘటన చూ పరులను కంటతడి పెట్టించింది. స్థానిక ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మండల పరిధిలోని కుర్మపల్లి గ్రామానికి చెందిన పట్నపు మణిపాల్ (18), వనం మల్లికార్జున్, పులి పవన్ (18), వారాల మణివర్థన్ (18) నలుగురు స్నేహితులు తమ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్‌లను తీసుకోవడానికి కారులో దేవరకొండకు వెళ్లి తిరిగి తమ స్వగ్రామం కుర్మపల్లికి పయణమయ్యారు. నసర్లపల్లి గ్రామ పరిధిలోనికి రాగానే ఎదురుగా హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టి అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న రాళ్ళను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు రమణ (35), మద్దిమడుగు అవినాష్ (12) తల్లి, తండ్రి, కుమారుడు తీవ్ర గాయాలపాలై రోడ్డు పక్కనే ఎగిరిపడ్డారు. దీంతో మద్దిమడుగు ప్రసాద్, మద్దిమడుగు అవినాష్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న పట్నపు మణిపాల్ (18) కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మద్ధిమడుగు రమణ(35), వనం మల్లికార్జున్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు ఎస్‌ఐ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న తీవ్ర గాయాలపాలయిన కుర్మపల్లికి చెందిన పులి పవన్, వారాల మణివర్థన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పిఎపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్, మద్దిమడుగు రమణ దంపతులకు ఇద్దరు మగ సంతానం ఉన్నారు. అవినాష్ పెద్దకుమారుడితో పాటు మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఇరువురు దంపతులతో పాటు పెద్దకుమారుడు అవినాష్‌తో హైదరాబాదు నుండి తల్లి, తండ్రి తమ స్వగ్రామమయిన అక్కంపల్లికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో నసర్లపల్లి పరిధిలోకి రాగానే అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డు పక్కన పడడంతోనే తండ్రి ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు అవినాష్ బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ళపై పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి రమణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కాగా ప్రసాద్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్న హరిజన కుటుంబం. అవినాష్ 7వ తరగతి చుదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో వారి కుటంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృత్యువులోనూ వీడని స్నేహం
మండల పరిధిలోని పట్నం మణిపాల్, వనం మల్లిఖార్జున్ ఇద్దరు మాల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరితో పాటు పులి పవన్, వారాల మణివర్థన్‌లు నలుగురు స్నేహితులు తమ సర్టిఫికెట్‌ల కోసం దేవరకొండకు వెళ్ళి తిరిగి కారులో అతి వేగంగా వస్తుండగా ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మృత్యువులోనూ మణిపాల్, మల్లిఖార్జున్ స్నేహం వీడకుండా చనిపోయారు. దీంతో కుర్మపల్లి గ్రామంలో విశాధఛాయలు నెలకొన్నాయి. మృతుల ఇళ్లలో రోధనలు మిన్నంటి చూపరులను కంటతడిపెట్టించాయి.
ఘటనాస్థలాన్ని సందర్శించిన డిఎస్‌పి గిరిబాబు
ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న దేవరకొండ డిఎస్‌పి గిరిబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి వవరాలు తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమయి ఉండొచచ్చని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు డిఎస్, ఎస్‌ఐ తెలిపారు.
ఆర్‌టిసి బస్సు బొల్తా : మృతి
ప్రజాపక్షం/అడ్డగూడూరు:యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్‌టిసిబస్సు బోల్తా పడింది. తొర్రూరు నుండి జగద్గిరిగుట్టకు వెళ్తుండగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చుక్క యాకమ్మ, కొండ రాములు మృతిచెందారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ఘటన స్థలంలో చిన్నపడిశాల గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఇసుక లారీల వల్ల రోడ్లు గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, అడ్వకేట్ యుగేందర్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వివిధ రాజకీయ నాయకులు మృతుల కుటుంబాలకు 50 లక్షలు ఎక్సిగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎదురుగా వస్తున్న ఆటో తప్పించే యత్నంలో అదుపు తప్పి బోల్తా పడిందని ప్రయాణికులు చెప్పారు. ఘటన స్థలాన్ని ఎసిపి మొగులయ్య, సిఐ మోతిరాం, ఎస్‌ఐ నాగరాజు, తహసీల్దార్ శేషగిరిరావు సందర్శించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్త ఆసుపత్రికి తరలించారు.
అతివేగానికిఐదుగురు బలి
RELATED ARTICLES