హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా రాష్ట్రం
గత కొద్ది రోజులుగా సడలిన లాక్‌డౌన్
రోజు రోజు పెరుగుతున్న జనసంచారం
పెద్దగా అడ్డుకోని వైనం
బలం చేకూరుస్తున్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు
ప్రజాపక్షం / హైదరాబాద్”: నెలన్నరకు పైగా లాక్‌డౌన్‌నే ఆయుధంగా మహమ్మారి కొవిడ్- యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలు క్రమంగా దారి నుంచి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ ఉన్నా సడలింపుల పేరుతో సాధారణ స్థితికి తీసుకువచ్చేలా ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో గత వారం నుండి, ముఖ్యం గా సోమవారం క్యాబినెట్ సమావేశం తరువాత రోడ్లపై జన సంచారం పెరిగినా పోలీసు లు పెద్దగా అడ్డుచెప్పడం లేదు. నెలన్నరగా అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్ని బంద్ అయ్యి, ఫ్యాక్టరీల నుండి ఉత్తత్తి నిలిచిపోవడంతో అటు ఉపాధి, ఇటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎంత కాలం ప్రజలను ఇళ్ళలో బంధించి ఎదురు చూస్తూ కూర్చోవాలనే ఆలోచన మొదలైంది. దీంతో నెమ్మదిగా కరోనా వైరస్‌పై పోరుకు హెర్డ్ ఇమ్యూనిటీ (సమూహ నిరోధక శక్తి)ని పెంచుకోవడమే మార్గంగా అడుగులు పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ప్రజలు ఇంట్లో కూర్చోకుండా బయట తిరిగితే, వైరస్ బారిన పడినా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం అన్నమాట. తద్వారా వైరస్ ప్రభావం తగ్గిపోతుందనే విశ్లేషణలు కొన్ని ఉన్నాయి. ఇజ్రాయిల్ వంటి దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ విషయంలో ప్రయోగాలు కూడా చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం లాక్‌డౌన్‌ను కొనసాగించబోమని ప్రకటించి హెర్డ్ ఇమ్యూనిటీ దిశగానే అడుగులు వేస్తున్నారు. భారత ప్రభుత్వం సైతం అదే బాటలో పయనించాలని భావిస్తున్నా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో భారీగా నమోదవుతున్న కేసులను చూసి తటపటాయిస్తున్నట్లుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ చర్యలను గమనిస్తే హెర్డ్డ్ ఇమ్యూనిటీ తప్ప గత్యంతరం లేదేమోనని భావిస్తున్నట్లుంది. ఇందుకు ఇటీవల ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలు, చర్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. వ్యాక్సిన్‌ను కనుగొనేంత వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు వేర్వేరు సందర్భాలలో వ్యాఖ్యానించారు. ఆ తరువాత సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వైన్ షాపులకు అనుమతించడంతో పాటు, వెనువెంటనే మధ్యలో ఆగిపోయిన పదవ తరగతి పరీక్షలను ఈ నెలలోనే పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియను మొదలుపెట్టి జూన్ రెండవ వారంలో ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతోంది. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు సుమారు 5.30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారు. అంటే అటూ ఇటుగా వారి తల్లిదండ్రులను కలుపుకొని 8-10 లక్షల మంది బయటకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం జాతీయ సగటు కంటే తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, పలు వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందానికి కూడా ఒక సంస్థ ఈ మేరకు ఫిర్యాదు చేయగా, ఆ సంస్థకు బిజెపి మూలాలు ఉన్నాయని, కావాలనే ఫిర్యాదు చేసిందని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. వాస్తవానికి కూడా ప్రభుత్వం కరోనా ప్రైమరీ కాంటాక్ట్‌తో కలిసిన వారిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపినా, ప్రైమరీ కాంటాక్ట్‌ను నేరుగా కలిసిన వారికి కరోనా లక్షణాలు ఉంటేనే టెస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వస్తే వారి కాంటాక్టులను క్వారంటైన్‌లో ఉంచి, లక్షణాలు ఉంటేనే టెస్ట్ చేస్తున్నారే తప్ప అందరికీ చేయడం లేదు. నెగెటివ్ వచ్చిన వారు కలిసిన వారికి టెస్టులు చేయడం లేదు. అయితే అసిమ్టామాటిక్ (వైరస్ సోకినా లక్షణాలు లేని) వ్యక్తికి నెగెటివ్ వచ్చినా లోపల వైరస్ ఉంటుందని, ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు వైరస్ సంక్రమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందుకే విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అయితే తాము ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్ట్(ఐసిఎంఆర్) మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రైమరీ కాంటాక్టుకు పాజిటివ్ వస్తేనే, ఆ వ్యక్తి సంబంధీకులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మరణించిన వ్యక్తులకు కొవిడ్ పరీక్ష చేయవద్దని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. గతంలో మరణించిన వారికి పరీక్షలు చేయగా కొందరికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. వారి కుటుంబ సభ్యులను పరీక్షించగా వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులు కూడా వేగంగా ఖాళీ అవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. వీటన్నిటినీ పరిశీలిస్తే రాష్ట్రం వేగంగా లాక్‌డౌన్ తాజా డెడ్‌లైన్ మే 29 నాటికి గ్రీన్ జోన్ వైపు అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం సైతం లాక్‌డౌన్ విషయంలో తొలినాళ్ళలో ఉన్నంత గట్టిగా ఉండడం లేదు. మొదట్లో గ్రీన్ జోన్‌లలో సైతం పకడ్బందీగా లాక్‌డౌన్‌ను కొనసాగించారు. బయట కనపడిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఇప్పుడు రెడ్ జోన్‌లో ఉన్న హైదరాబాద్ మహానగరంలోనే ఆ పరిస్థితులు కనపడకపోగా, జనసంచారం రోజు రోజుకు పెరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం హెర్డ్ ఇమ్యూనిటీనే మార్గంగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా బారిన పడినా మరణాల శాతం 3 వరకే ఉండగా, మిగతా వారు కోలుకుంటున్నారు. కాబట్టి తీవ్రంగా ఆస్వస్థత పాలైతేనే ఆసుపత్రికి రప్పించాలని, మామూలు (మైల్డ్) లక్షణాలు ఉంటే ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కొవిడ్ కోసం 8 ఆసుపత్రులను ప్రత్యేకించగా, కొత్తగా ఐదు ఆసుపత్రులను కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అడుగులు అటువైపే?
RELATED ARTICLES