మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల కోసం గాలింపు
పోయిన చోట వెతుక్కునే క్రమంలో మావోయిస్టులు?
నిఘా పెంచిన పోలీసులు
అడ్డుకట్టకు ఏరియా సర్వేలు
గొత్తె గ్రామాల్లో విస్తృత తనిఖీలు
సరిహద్దుల్లో హై అలర్ట్
ఆదివాసీల్లో భయం
భద్రాచలం : తెలంగాణలోకి మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు వచ్చాయని వార్త పోలీసుల చెవిలో పడటంతోనే అడవుల్లో అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల వద్ద ఉన్న పక్కా సమాచారం మేరకు పినపాక మండలంలోని నీలాద్రి గుట్టల్లో మావోయిస్టులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఆ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కిట్ బ్యాగులు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. దీంతో పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. మావోయిస్టుల కార్యకలాపాలపై పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. గత మూడు రోజుల క్రితం ఏజెన్సీ అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ల ద్వారా సర్వే చేశారు. డ్రోన్ కెమేరాలు ఏర్పాటు చేసి గుగుల్ మ్యాప్ సహాయంతో, రేడార్ రూట్‌ను అనుసందానం చేసుకుంటూ వీడియో చిత్రీకరణ చేశారు. మరోపక్క ఆదివాసీ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టులకు సహకరించవద్దని, వారి వివరాలు ఉంటే చెప్పాలని అడుగుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్ టీంల వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పెద్ద ఎత్తున బలగాలు ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం లోని పినపాక అటవీ ప్రాంతంలో మోహరించారు.మరో ప్రక్క ములుగు,జయశంకర్ భూ పాలపల్లి జిల్లాల్లో సైతం సోదాలు, తనిఖీలు సాగుతున్నా యి.గోదావరి నదిని దాటి అడవుల్లోనికి ప్రవేశించే అవకా శం ఉండటంతో ఆ మార్గాల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టా రు. ఏడుగురు సభ్యులుగల మావోయిస్టులు ఇక్కడికి ఎం దుకు వచ్చినట్లు, నీలాద్రిగుట్టల్లో ఎన్ని రోజులు ఉన్నారు ఆనేదానిపై పెద్ద ఎత్తున పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోయిన చోట వెత్తుక్కోనేందుకేనా…
మావోయిస్టులు పెట్టని కోటగా ఉండే తెలంగాణ క్రమక్రమంగా ఉద్యమానికి దూరమైంది. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాం తానికి వలస పోయిన మావోయిస్టు పార్టీ, ఆ అడవుల కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించారు. అయితే ఆ ప్రాంతం ఎదురు దెబ్బలు మొదలవడంతో మరో ప్రక్కకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకే మరో సారి తెలంగాణ వైపు కన్నేశారని అంతా అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నీలాద్రిపేట, బండారుగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం చేసిన మావోయిస్టులు పోలీసులను తప్పుతోవ పట్టించేందుకేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేపర్ వార్ నడిచిన అతి కొద్దికాలంలోనే నిఘా వర్గాలు మావోల కదలికలను పసిగట్టా యి. తెలంగాణలో బలపడాలనే తలంపుతో మావోయిస్టు లు ఉన్నట్లు తెలుస్తోంది. అందునా ఇప్పుడు మావోయిస్టు పార్టీని నడిపించే అగ్రనేతల్లో తేలంగాణకు చెందినవారే ఎక్కువగా ఉండటం అనుమానాలను బలపరుస్తోంది.
గొత్తె గ్రామాలపై పూర్తి నిఘా
ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం నుండి బ్రతుకుదెరువు పేరుతో వలస వచ్చిన గొత్తెకోయ ఆదివాసీ గ్రామాలపై నిఘా పెంచారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 208 వలస గ్రామాలుఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన జీవస్తున్న చాలా మందికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేది పోలీసుల అనుమానం. అయితే పోలీసులు అనుమానాలు నిజమయ్యాయి. మావోయిస్టులు ఇక్కడికి వచ్చిన వలస ఆదివాసీల సహాయాన్ని తీసుకుంటున్నట్లు తేటతెల్లమైంది. దీంతో ఇక్కడి వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించడంతో అసలు నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసులు ఇంటరాగేషన్‌లో సేకరించిన ఆధారాల ప్రకారం నీలాద్రిగుట్టల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. దీనిని పసిగట్టి ఏడుగురు సభ్యులు గల యాక్షన్ టీమ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గోదావరి దాటి పోకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. అయితే మొత్తం నాలుగు మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు, కాంట్రాక్టర్లుకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హై అలర్ట్
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు సంచారం నిజమని తేలడంతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఎటు చూసిన తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలను నిలుపుదచేసి సోదాలు చేస్తున్నారు. అంతే కాకుండా గోదావరి నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున గ్రేహెండ్స్ బలగాలు సంచరిస్తున్నాయి. మరో ప్రక్క ఛత్తీస్గడ్, ఒడిస్సా సరిహద్దుల్లో సైతం నిఘా పెంచారు. అటవీ గ్రామాల ద్వారా గోదావరి తీరాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ఆటుగా ఉండే గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు రిక్రూట్మెంట్ లు చేసుకుని దళాన్ని బలోపేతం చేసే దిశగా మావోయిస్టు కేంద్రకమిటీ ఆలోచనలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణను మరోసారి సేఫ్ జోన్‌గా ఎన్నుకుంటున్నట్లు తెలుస్తోంది. పెంచిన నిఘా ద్వారా పూర్తి స్థాయిలో మావోల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారు.
ఆదివాసీల్లో భయం..భయం….
పెరగుతున్న మావోయిస్టు కార్యకలాపాలతో ఆదివాసీలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వలస ఆదివాసీ గ్రామాల్లోని వారే మావోయిస్టులు సహకరిస్తున్నారని తేలడంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మావోయిస్టుల సమాచారం చెప్పాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క దళాల సమాచారం పోలీసులకు ఇస్తే మావోయిస్టుల నుండి ముంప్పు ఉండనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్ల పేరుతో హతమవుతున్నారి. అక్కడ బ్రతకలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బ్రతకనిచ్చే పరిస్థితుల్లేవంటూ పలువురు చర్చింకుంటున్నట్లు తెలుస్తోంది.
అడవుల్లో అన్వేషణ
RELATED ARTICLES