రాష్ట్రమంతటా అటవీ పునరుద్ధరణ పనులు
అందరి కృషితో హరితహారం కార్యక్రమం కొనసాగాలి
ములుగులో ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రం (ఎఫ్‌సిఆర్‌ఐ) ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్/ సిద్దిపేట : దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించామని, అందుకు అనుగుణంగా ములుగులో ఫారెస్ట్ కాలేజీ రూపుదిద్దుకున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నా రు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమిళనాడులోని మెట్టుపలాయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించిందని, అంతకంటే ఎక్కువ మంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తన కార్యాలయంలో ఒఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాం క వర్గీస్, ఆమె భర్త ఇద్దరూ మెట్టు పలాయం కాలేజీలో చదివి ఐఎఫ్‌ఎస్ అధికారులు అయ్యారని, తెలంగాణ విద్యార్థులు అలా ఎంపిక కావాలన్నది తమ ఆశయం అన్నారు. సొంత నియోజకవర్గం గజ్వేల్ పర్యటనలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ .కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభించారు. ముందుగా పైలాన్ ఆవిష్కరణ తర్వాత కళాశాల ఆవరణలో సిఎం కెసిఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సిఎం ముచ్చటించారు. కాలేజీ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన సిఎం బాగా చదివి అటవీ నిపుణులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి.హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, సిఎం స్పెషల్ సెక్రెటరీ భూపాల్‌రెడ్డి, అటవీశాఖ స్పెషల్ సిఎస్ రాజేశ్వర్ తివారీ, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ ఆర్.శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ తర్వాత గజ్వెల్ మహతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ అటవీ కాలేజీ, హరితహారం, అటవీ పునరుద్ధరణ విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని సిఎం కోరారు. మొక్కలు నాటుతూ, వాటిని రక్షించాలన్నారు. రాబోయే తరాలకు ఆస్తులకంటే, నివాసయోగ్యమైన వాతావరణం ఇద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీశాఖ ద్వారా అటవీ పునరుద్ధరణ పనులు చాలా బాగా కొనసాగు తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో పునరుద్ధరణ పెద్దఎత్తున జరగాలని సమావేశంలో ఉన్న పిసిసిఎఫ్ ఆర్.శోభను సిఎం కోరారు. ఇదిలా ఉండగా కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కాం ప్లెక్స్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ (ఫ్రూట్స్)ను సిఎం కెసిఆర్ సందర్శించారు. పైలాన్‌ను ఆవిష్కరించి, మొక్క నాటారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత కార్యాలయ భవనాలను ప్రారంభించారు. రూ.27.35 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వంద పడకల మాతా శిశు ఆసుపత్రికి, రూ.99 కోట్లతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు సిఎం కెసిఆర్ శంకుస్ధాపన చేశారు. గజ్వేల్‌లో మహితి ఆడిటోరియంను ప్రారంభించారు.