తరాలుగా మారని తలరాతలు
కాగితాలకే పరిమితమైన చట్టాలు
వికాసం పేరిట వినాశనం
అడవుల్లోనూ కరువైన జీవనం
త్రిశంకు స్వర్గంలో గిరిజన బతుకులు
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రజాపక్షం/భద్రాచలం : చెట్టూ.. పుట్టా.. కొండా…కోనా… ఆకూ… అలం, చేను… చెలిమా ఇది ఆదివాసీల జీవనం. కొండకోనల్లో జీవితం, నిండైన అమాయకత్వం. కల్లాకపటం ఎరుగని మనస్తత్వం, ఇదీ గిరిజన బతుకు సిత్రం. అడవంటే అందం, ఆహ్లాదం, ఆనందం, ఇదీ బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ బతుకు చిత్రమని, వసతులు మృగ్యమని, జీవనయానం దినదిన గండమని ఎంతమందికి తెలుసు ?. అడవి తల్లి ఒడిలో ఆహ్లాదం మాటున ఆదివాసీల వ్యథ ఉంది. అక్కడ వినిపించే రేల పాటల్లో విషాదం దాగుంది. గిరిజనాభివృద్ధి అడవి కాచిన వెన్నెల అన్నది
బహిరంగ రహస్యం : మానవ మనుగడ ప్రారంభానికి ప్రధమ భూమిక ఆదివాసీలదే పురాణాల్లో సైతం గిరిజనుల గూర్చి ఆధారాలున్నాయి. వీరి జీవన విధానాలు తొలి నాళ్ల నుండి ప్రత్యేకమే. తరాలు మారినా వారి తలరాతల్లో ఎలాంటి మార్పులేదు. జనాభా లెక్కల ప్రకారం బ్రిటీస్ ప్రభుత్వం గిరిజనలను ఎనిమిస్టులు గా పిలిచేవారు. అప్పట్లో ఆయా ప్రాంతాల షెడ్యూల్ జిల్లాలు 1874 లో ప్రకటించారు. హైదరాబాద్ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్ ప్రాంతాలుగా గుర్తించింది.్ర బిటీష వారు వీరిని హీల్‌ట్రైబుల్‌గా పిలిచారు. వారి భూమి రక్షణ కోసం చట్టాలు సైతం చేశారు. అంతటి విశేష నాగరికత ఉన్న ఆదివాసీలు నేడు అస్థిత్వాన్ని కోల్పోయి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.
సంకట స్థితిలో బతుకులు: స్వాంతంత్య్రం వచ్చి ఏడు దశాబ్థాలు దాటినా నేటికీ ప్రభుత్వ ఫలాలు ఆశించిన స్థాయిలో వారి దరి చేరలేదు. జీవన వైవిద్యాన్ని వృక్ష ప్రకృతి సంపదను రక్షిస్తూ వస్తున్న ప్రాంతం భద్రాచలం మన్యం. వీటిని కాపాడుతూ వస్తున్న కోయ, కొండ రెడ్ల తెగలు తరతరాలుగా జీవిస్తున్న ప్రాంతం ఇది. 1994లో జనీవాలో జరిగిన సమావేశంలో ఆగస్టు 9న ఏటా ప్రపంచ ఆదివాసీ వినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చింది. దీంతో నాటి నుండి నేటి వరకు ఆగస్టు 9 వతేదీన ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దీనిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం లేదు.
వినాశనం: వికాసం మాటున గిరిజనుల వినాశనంసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సుమారు 2 లక్షల గిరిజన జనాభా వెయ్యికి పైగా గ్రామాలు నీటి మునిగిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టుకు అభివృద్ధి అనే పేరుపెట్టి ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టేందుకు పాలక ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం పోలవరానికి జాతీయ హోదాను ఇచ్చి పనులు కానిచ్చేస్తోంది. రేపోమాపో ఈ ప్రాజెక్టు పుణ్యమా అని సాంప్రదాయ గిరిజన ప్రాంతం కనుమరుగుకానుంది.
త్రిశంకు స్వర్గంలో బ్రతుకులు:గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటిడిఎలు గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నింపడంలో చతికిల పడుతున్నాయి. గిరిజనాభివృద్ధి పేరిట 1975 నుండిఇప్పటి వరకు లక్షల కోట్లను ఖర్చు చేసినప్పటికీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే గిరిజనుల బతుకుల్లో కాస్తంత వెలుగులు నిండుకుంటున్నాయని అనుకుంటే తాజాగా పోలవరం ప్రాజెక్టు వారి బ్రతుకులను ఛిన్నాభిన్నం చేసే పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో విషజ్వరాల బారినపడి ప్రతీ ఏటా వందలాది మంది గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. పౌష్టికాహార లోపంతో అనేక మంది పిల్లలు జీవచ్ఛాల్లాగా మగ్గుతున్నారు. పౌష్టికాహార కేంద్రాలు, శిశు ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వారి దరిచేరడం లేదు. వాటి పేరిట కోట్లాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. ట్రైకార్ రుణాలు కూడా గిరిజనుల పేరిట బడాబాబులు కాజేస్తున్నారు. దీంతో గిరిజనాభివృద్ధి కుంటుపడుతూనే ఉంది.
కలవరపెట్టే నిజాలు: దేశ జనాభాలో 200 ఆదిమ తెగులున్నాయి, వీరిలో 90 శాతం మంది అటవీ ఫలాలు, పోడు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు, కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యిమందిలో 84.01 ఆదివాసి శిశు మరణాల పాలవుతున్నారు. ఐదేశ్లలోపు చిన్నారులు 25.05 శాతం మరణిస్తున్నారు. ప్రతీ వెయ్యి మందిలో 710 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శిశు మరణాలు 10 శాతానికి పైగానే ఉన్నాయి. జ్వరాలు తదితర రోగాలతో బాధపడుతూ సకాలంలో వైద్యం అందక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఆదివాసీలు చదువుల్లో వెనుకబడే ఉన్నారు. 2013 గణాంకాల ప్రకారం జాతీయ అక్షరాస్యతా శాతం జాతీయ సరాసరి కన్న తక్కువగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతా శాతంలో వెనుకబడి ఉంది. కలుషిత నీరు, పరిసరాల పరిశుభ్రత నిరక్షరాస్యత అమాయకత్వం వీరి జీవితాలను శాసిస్తున్నాయి. రోగాలతో సతమతం అవుతున్నారు. ఇప్పటికీ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో రహదార్లు లేవు, దీంతో గర్భిణీలను జట్టీలపై తీసుకురావాల్సిన పరిస్థితి ఉండడం విచారకరం.