సెక్రటేరియట్ కూల్చివేతకు నిరసనగా 25న చలో సచివాలయం
కూల్చివేతను నిరసిస్తాం: వివేక్, కోదండరామ్, పొన్నం తదితరులు
ప్రజాపక్షం/హైదరాబాద్: సచివాలయాన్ని కూల్చాలనే నిర్ణయానికి నిరసనగా ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నుట్ల వెంకటస్వామి ఫౌండేషన్ నిర్వాహకులు, మాజీ ఎంపి జి.వివేక్ వెంటకస్వామి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, తెలంగాణ ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ప్రసాద్‌తో కలిసి వివేక్ వెంకటస్వామి మాట్లాడు తూ సచివాలయ కూల్చివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, గవర్నర్ జోక్యం చేసుకని చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడం కోసమే “చలో సెక్రటేరియట్” నిర్వహిస్తున్నామన్నారు. కొత్త రాష్ర్టం ఏర్పడినప్పుడు సచివాలయం నిర్మించుకోవచ్చని, కానీ సచివాలయం, శాసనసభ భవనాలు ఉన్న దగ్గర వాటిని కూల్చి మళ్ళీ కొత్తవి నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో సచివాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ర్టం ఆర్థ్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఉద్యోగాల ఖాళీలు, పలు పథకాలకు కూడా పైసలు లేని పరిస్థితులు అని, ఇలాంటి సందర్భంలో ప్రస్తుత సచివాలయాన్ని ఎందుకు కూల్చుతున్నారో ప్రభుత్వం హేతుబద్ధమైన కారణం చెప్పడం లేదని అన్నారు. అట్టహాసం కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. రాష్ర్టంలో చాలా మందికి రుణమాఫీ, బీమా అమలు కావడం లేదని, పెన్షన్ దారుల పెన్షన్‌ను బ్యాంక్‌లు ఆపుతున్నాయని తెలిపారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలనసాగుతుందన్నారు. చలో సచివాలయం కార్యక్రమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. సచివాలయ కూల్చివేతపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని వివరించారు. నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ అపరిచితుడు, తుగ్లక్, రజ్వి కలిస్తే ఒక కెసిఆర్ పాలన అని ఎద్దేవా చేశారు. సిఎంకు వాస్తు మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదన్నారు.త్యాగాల తెలంగాణను యాగల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చే బదులు దానిని మూసిలో వేయడం మేలని వ్యాఖ్యానించారు. ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పాలిస్తున్నారా..? లేదా సిద్ధాంతులు పాలిస్తున్నారో అర్థ్ధం కావడం లేదన్నారు. టిజెఎస్ నాయకులు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, సయ్యద్ భద్రుద్దీన్ మాట్లాడుతూ సచివాలయం అంశం న్యాయస్థానంలో విచారణలో ఉండగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
అట్టహాసం కోసమే కొత్త సచివాలయ నిర్మాణం
RELATED ARTICLES