అడవిలో పిల్లలతో మొక్కలు నాటించిన సంఘటనపై స్పందించిన చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ
ప్రజాపక్షం/కొత్తగూడ అటవీ శాఖ అధికారులు పిల్లలతో మొక్కలు నాటించిన ఘటనను చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) తీవ్రంగా పరిగణించింది. మహ బూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధిలోని కొత్తగూడ మండలం చిట్యాలగడ్డ అటవీ ప్రాంతంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్న పిల్లలతో అడవులలో మొక్కలు నాటించిన ఘటనపై “హవ్వ.. ఇదేం పని” శీర్షికతో ‘ప్రజాపక్షం’ దిన పత్రికలో ఇటీవల ప్రచురించిన కథనంపై జిల్లా సిడబ్ల్యుసి స్పందించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్లాంటేషన్‌లో పిల్లలతో పనులు చేయించుకున్న అటవీ శాఖ సెక్షన్ అధికారి హట్టిసింగ్‌ను, పనులకు వెళ్ళిన చిన్నారులను, వారి తల్లి దండ్రులను మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యుసి బెంచ్ ముందు ప్రవేశపెట్టారు. ఒక బాధ్యత కలిగిన అధికారి దగ్గరుండి మరీ చిన్నారులతో పనులు ఏలా చేయిస్తున్నారని చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ కమిషనర్ నాగవాణి అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. చిన్నారుల తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను చదివించాలని కమిషనర్ సూచించారు. తదుపరి విచారణ అనంతరం ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపడతామని కమిషనర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్లాంటేషన్‌లో విద్యార్థులతో అటవీ శాఖ రేంజ్ అధికారి మొక్కలు నాటిస్తూ వారిని బాల కార్మికులుగా మార్చడం, పైగా వారితో పని చేయించుకోవడమే నేరం కాగా వారికి కూలీ కూడా తక్కువగా ఇచ్చిన విషయాలను ‘ప్రజాపక్షం’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
అటవీ అధికారిపై.. సిడబ్ల్యుసి బెంచ్ విచారణ
RELATED ARTICLES