రెండేళ్లుగా జరగని సమావేశం
కేంద్ర పథకాలు, రావాల్సిన నిధులపై నిర్లక్ష్యం
ప్రజాపక్షం / కరీంనగర్ బ్యూరో
కరీంనగర్ ‘జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్ష ణ కమిటీ’ (దిశ) సమీక్ష సమావేశాలను అటకెక్కించారు. గతంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఉండగా గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) గా మార్చింది. స్థానిక పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్షిస్తారు. కానీ జిల్లాలో దాదాపు రెండేళ్లుగా ‘దిశ’ సమావేశాన్ని నిర్వహించలేదని, సమావేశ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీ సమావేశాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఫిబ్రవరి మాసాల్లో స్థానిక పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన కచ్చితంగా నిర్వహించాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాలోని 28 కీలక శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయపరిచి జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించడం ‘దిశ’ సమీక్ష ముఖ్య ఉద్దేశం. జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల మంజూరు విషయంలో జాప్యం జరిగినా, స్థానిక ఎంపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందుకు ఈ సమావేశం తగిన సమాచారాన్ని అందజేస్తుంది.
స్థానిక సమస్యలపై పట్టింపేదీ?
జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అధ్యక్షతననే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో ఎంపిగా గెలుపొందిన సంజయ్ రెండేళ్లుగా నిర్వహించకపోవడం, స్థానిక సమస్యలను పక్కనపెట్టి రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి సారించారనే చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని నిరంతరం పోరాడుతున్నారని బిజెపి శ్రేణులు చెబుతుండగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజల నుంచి అపవాదును ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు జిల్లా వాసులను వెంటాడుతుండగా కనీస పట్టింపులేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ సమావేశం జరగకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినా లబ్ధిదారులకు కేటాయించలేదు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో పేదలు కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల వల్ల వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. జాతీయ రహదారులు, ఇంధన ఉత్పత్తులు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని ప్రజలు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నేషనల్ హౌజింగ్ స్కీమ్ (రూరల్, అర్భన్), ధీన్ దయాల్ ఉపాధ్యాయ జీవన్ క్రాంతి యోజన లాంటి 28 రకాల పథకాల అమలు గురించి అడిగిన నాధుడే లేడని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా వాతావరణ కాలుష్యం రాకుండా ఎంపి సంజయ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రజలు ఆరోపణ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎంపి, అధికార యంత్రాంగం చోరవ తీసుకుని దిశ సమావేశాన్ని నిర్వహించి కేంద్ర పథకాల అమలుపై దృష్టి సారించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.
అటకెక్కిన ‘దిశ’
RELATED ARTICLES