యుఎపిఎ కొత్త సవరణ చట్టం కింద హోంశాఖ ప్రకటన
న్యూఢిల్లీ: నిషేధిత జైషే- మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, జమాత్- ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ ఆపరేషనల్ కమాండర్ జకీ-ఉర్- రెహమాన్ లఖ్వి, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ) కింద ఉగ్రవాదులుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ప్రకటించింది. ఈ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. గత చట్టం కింద ఉగ్రవాద సంస్థలను మాత్రమే ప్రకటించడం జరిగేది. తాజాగా సవరించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి వెసులుబాటు కలిగింది. యుఎపిఎ 1967కు కీలక సవరణలను నెల కిందట పార్లమెంటు ఆమోదించిందన్నది తెలిసిన విషయమే. ఈ కొత్త చట్టం కిందే వారిని ఉగ్రవాదులుగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు వ్యవస్థాపకుడు, చీఫ్ అయిన మసూద్ అజర్ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నడుపుతున్నారని, తన బోధనా విభాగాల ద్వారా ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కార్యకలాపాలు నిర్వహిస్తూ, వాటికి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఎన్‌ఐఎ ఆయనపై పలు కేసులు నమోదు చేసి, ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, విచారణ జరుగుతోందని తెలిపింది. 2001లో కశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్‌పై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2017లో శ్రీనగర్‌లో బిఎస్‌ఎఫ్ క్యాంప్‌పై దాడి, ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో కూడా ఆయనపై ఎన్‌ఐఎ అభియోగపత్రం నమోదు చేసిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 తీర్మానం ప్రకారం 2019 మే 1న అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. న్యూఢిల్లీ ప్రత్యేక జడ్జి(పోటా) కూడా అతడిని ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించారు. హఫీజ్ మహమ్మద్ సయీద్ నిషేధిత లష్కరే తోయిబా/ జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ చీఫ్‌గా ఉన్నాడని తెలిపింది. ఇండియాలోని జరిగిన పలు ఉగ్రదాడుల్లో అతడి ప్రమేయం ఉందని పేర్కొంది. ఎర్రకోటపై దాడి (2000 డిసెంబర్ 22), రాంపూర్ దాడి (2008 జనవరి 1), 26/11 ముంబై దాడి, జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడి (2015 ఆగస్టు 5)లో ఆయన ప్రమేయం ఉందని తెలిపింది.
నిషేధిత లష్కరే తోయిబా చీఫ్ ఆపరేషన్ కమాండర్‌గా ఉన్న లఖ్వికి సైతం ఇండియాలోని పలు ఉగ్రదాడుల్లో ప్రమేయముందని ఎంహెచ్‌ఎ తన ప్రకటనలో తెలిపింది. 2000లో ఎర్రకోటపై దాడి, 2008లో రాంపూర్ సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై దాడి, 2008లో ముంబయి దాడి, జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడి వంటి ఘటనల్లో ఆయన ప్రమేయం ఉందని పేర్కొంది. ఆయా కేసుల్లో ఎన్‌ఐఎ ఆయనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని తెలిపింది. దావూద్ ఇబ్రహీం కస్కర్ అంతర్జాతీయ అండర్‌వరల్డ్ క్రైమ్ సిండికేట్ నడుపుతున్నాడని, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడం, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ సరఫరా, మనీ లాండరింగ్, నార్కోటిక్స్, దందాలు, ఇండియా, విదేశాల్లో బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రముఖ వ్యక్తుల హత్యాయత్నాలతో ప్రజలను భయభ్రాంతులను చేయ డం, సామాజిక అంశాతిని రెచ్చగొట్టడం వంటి కార్యకలాపాల్లో ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఆయనను ప్రకటించిందని తెలిపింది. అల్‌ఖైదా ఆంక్షల జాబితాలో కూడా అతడి పేరును 2003 నవంబర్ 3న చేర్చారు. అతడిపై యుఎన్ భద్రతా మండలి 2006 ఏప్రిల్ 6న ఓ ప్రత్యేక నోటీసును కూడా జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలతో దావూద్‌కు ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం బలంగా నమ్ముతున్నందున ఆయనను సవరించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) కింద ఉగ్రవాదిగా ప్రకటించినట్టు పేర్కొంది. దావూద్ 1993 మార్చిలో ముంబయిలో వరుస బాంబు దాడుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు.