పాకిస్థాన్‌కు ఆధిక్యం, న్యూజిలాండ్‌తో మూడో టెస్టు
అబుదాబి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 274 పరుగులకు ఆలౌట్ కాగా, బదులుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టులో అజహర్ అలీ (134), అసద్ షఫీక్ (104) శతకాలతో చెలరేగారు. దీంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసి 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఓపెనర్లు రవాల్ (0), లాథమ్ (10) పరుగులు మాత్రమే చేసి పెవలియన్ చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (14 బ్యాటింగ్), సొమర్‌విల్లె (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ, యాసిర్ షా చెరొక వికెట్ పడగొట్టారు. బుధవారం మూడో రోజు 139/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్లు అజహర్ అలీ, అసద్ షఫీక్‌లు ఆదుకున్నారు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులను రాబట్టుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అజహర్ 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్ది సేపటికే షఫీక్ కూడా 142 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దీంతో పాకిస్థాన్ 200 పరుగుల మైలురాయిని దాటింది. ఈ జంటను విడదీయడానికి ప్రత్యర్థి బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారికి ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే వీరు నాలుగో వికెట్‌కు 200 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. తర్వాత ఒక పరుగు వ్యవధిలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అజహర్ అలీ 297 బంతుల్లో 12 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం షఫీక్ 255 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే షఫీక్ (104)ను అజాజ్ పటేల్ పెవిలియన్ పంపాడు. తర్వాత పుంజుకున్న న్యూజిలాండ్ బౌలర్లు వరసక్రమాల్లో వికెట్లు తీయడంతో పాకిస్థాన్ 135 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. చివర్లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (24) తప్ప మిగతా బ్యాట్స్‌మన్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో పాకిస్థాన్ 62 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో సొమర్‌విల్లె 4 వికెట్లు పడగొట్టగా.. బోల్ట్, అజాజ్ పటేల్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అజహర్, అసద్ షఫీక్ శతకాలు
RELATED ARTICLES