ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ
చర్చకు రాహుల్‌గాంధీ వాయిదా తీర్మానం : స్పీకర్ తిరస్కృతి!
లఖింపూర్ ఘటనపై ఆందోళనలు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో హింసాత్మక ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ జిల్లా కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో వెల్లడించిన సత్యాలపై లోక్‌సభలో బుధవారం తీవ్ర గందరగోళం, గగ్గోలు చెలరేగింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలంటూ ప్రతిపక్ష సభ్యులు చేసిన నినాదాలతో లోక్‌సభా వేదిక దద్దరిల్లిపోయింది. ప్రతిపక్షాల పట్టరాని ఆగ్రహం, నినాదాలు, గందరగోళం మధ్య లోక్‌సభాపతి ఓం బిర్లా సభను నిర్వహించలేక వాయిదా వేసేశారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఆయన అనుచరులు ఈ కేసులో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశా యి. ఆశిష్ మిశ్రా తండ్రిగా, అంతకుముందు రైతులను బెదిరింపులకు గురిచేసిన బాధ్యుడుగా కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తెర వెనుక కథ నడిపించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెంటనే ఆయన్ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష ఎంపీలు మూకుమ్మడిగా సభామధ్యస్థలంలోకి దూసుకువచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. వివిధ పత్రికల ప్రతులను చేతుల్లో పట్టుకుని గాల్లో ఊపుతూ, ప్రత్యేక దర్యాప్తు బృందం నిదిక సంగతేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
లఖింపూర్ హింసాత్మక ఘటనలపై సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ, ఇతర ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చకు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అయితే దానిని స్పందించకుండా పరోక్షంగా తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. సభను సజావుగా నడిచేలా సహకరించాలని కోరడంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. సమస్యలు లేవనెత్తడానికి సభ్యుకు నెనెప్పుడూ తగినంత సమయం ఇస్తా, మీరు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వడంలేదు, ఇది మంచి సంప్రదాయం కాదు, సభామర్యాదను కాపాడేపద్ధతి ఇది కాదు, మీరు చర్చ జరగాలని లేదు అని ఓం బిర్లా విరుచుకుపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులు కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని, వారికి మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇంత గందరగోళం మధ్య కూడా మంత్రులు నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక 11.30 తర్వాత సభ ఎట్టిపరిస్థితుల్లో ముందుకు కొనసాగే అవకాశం కనిపించకపోవడంతో సభాపతి సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా లోక్‌సభలో అదే గందరగోళం, అవే డిమాండ్లు పునరావృతమయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడాన్ని కొనసాగించారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న అగర్వాల్ సభను గురువారం ఉదయం వరకూ వాయిదా వేశారు.
అక్టోబరు 3వ తేదీన లఖింపూర్ జిల్లా తికునూరు గ్రామ సమీపంలోని రహదారిపై శాంతియుతంగా నిరసన ప్రదర్శనచేసి తిరిగివెళ్ళిపోతున్నవారిపై కాన్వాయ్ వాహనం దూసుకుపోవడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ మంగళవారంనాడు లఖింపూర్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ఎదుట ఈ నివేదికతో కూడిన ఒక దరఖాస్తు దాఖలు చేస్తూ, కాకతాళీయంగానో, పొరపాటుగానో, తొందరపాటుతోనే కాన్వాయ్ వాహనం రైతులమీదకు దూసుకువెళ్ళలేదని, పక్కా ప్రణాళికతో, ఒక పథకం కుట్ర ప్రకారమే రైతుల హత్య జరిగిందని పేర్కొంటూ, ఈ కేసులో ఐపిసి సెక్షన్లు మార్చివేసి కఠినశిక్షలు పడేలా వేరే సెక్షన్లు పెట్టి 13 మంది నిందితులకు తిరిగి వారంట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ సంఘటనపై ఇప్పటివరకూ ఉన్న సందేహాలు, అనుమానాలు అన్నీ తీరిపోయి సత్యం వెల్లడికావడంతో దేశంలో తీవ్రమైన గందరగోళం చెలరేగింది.
అజయ్ మిశ్రాను తొలగించాల్సిందే
RELATED ARTICLES