భూ వివాదంపై నిఘా వర్గాల నజర్
నిందితుల కోసం పోలీసుల గాలింపు
అఖిలప్రియకు ప్రాణహాని : భూమా మౌనిక
ప్రజాపక్షం/హైదరాబాద్బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను పోలీసు కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వాలని బోయిన్పల్లి పోలీసులు న్యాయస్థానంలో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు, అఖిలప్రియ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించగా తీర్పు సోమవారానికి వాయిదా పడింది. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నదని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా బెంగళూరులో ఉన్న భార్గవ్ నేరుగా న్యాయస్థానంలో లొంగిపోతున్నట్టు శుక్రవారం సాయంత్రం వరకు ప్రచారం జరిగింది. కానీ భార్గవ్ బెంగుళూరు నుంచి మరో ప్రాంతానికి వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని అఖిలప్రియ తరపు న్యాయవాది, వారి కుటుంబ సభ్యులు చెబుతుంటే , మరో వైపు పోలీసులు మాత్రం అఖిలప్రియను మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించేందుకు అనుమతి కోరారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నదని, నిందితులను అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాల్సి ఉన్నదని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మరో వైపు ఈ కేసు దర్యాప్తుపై అఖిలప్రియ కుటుంబ సభ్యులు పలు అనుమానాలు, అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. హఫీజ్‌పేట భూములు తమవేననని చెబుతూనే, ఈ భూవివాదంలో మరికొందరు పెద్దల హస్తం ఉన్నదని ఆరోపించడం చర్చనీయంశంగా మారింది.
భూ వివాదంపై నిఘా వర్గాల నజర్
హఫీజ్‌పేట భూవివాదానికి సంబంధించిన కిడ్నాప్ కేసుపై నిఘా వర్గాలు పలు అంశాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మీడియాతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నజర్ పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కేసుతో వాస్తవంగానే సంబంధాలు ఉండి మాట్లాడుతున్నారా? లేదా ఇతర రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా అఖిలప్రియకు సంబంధించిన కుటుంబ సభ్యుల కదలికలు, వారితో కలుస్తున్నవారు, దీనికి తోడుగా ఈ కేసుతో ముడిపన అంశాలపై మీడియాతో మాట్లాడుతున్నవారి ఉద్దేశ్యాలు ఇలా పలు అంశాల కూపీ లాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ కాగితాలు ఎక్కడ?
భూవివాదానికి సంబంధించి బాధితులతో సంతకాలు చేయించిన పేపర్లు ఎక్కడ ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ పేపర్లు భార్గవ్ వద్దనే ఉన్నాయా? లేదా అందులో ఇంకా ఏమైనా వారికి అనుకూలంగ రాసుకున్నారా? అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భార్గవ్‌తో పాటు మిగతా వారు అరెస్టు వారిని విచారిస్తే తప్పా దీనికి సంబంధించిన సస్పెన్స్ తొలగదని పోలీసులు భావిస్తున్నారు.
అఖిలప్రియకు ప్రాణహానీ: భూమా మౌనిక
ప్రజాపక్షం/హైదరాబాద్: మాజీ మంత్రి ,తన సోదరి అఖిలప్రియకు ప్రాణహాని ఉన్నదని భూమా మౌనిక అన్నారు. తమకు ఎక్కడా రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. అఖిలప్రియ సరిగ్గా భోజనం చేయడం లేదని, ఆమెకు ఆరోగ్యం బాగా లేదన్నారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారన్నారు. భూ వివాదంపై చర్చించేందుకు తాము సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు.
రాజకీయంగా వేధిస్తున్నారు
ఈ భూముల వెనకాల పెద్దలు
సిఎం కెసిఆరే న్యాయం చేయాలె : అఖిల సోదరులు జగత్ విఖ్యాత్ రెడ్డి
తమను రాజకీయంగా వేధిస్తున్నారని, ఎ.వి.సుబ్బారెడ్డితో కొందరు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు. ఈ భూ వివాదం వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారని, తమకు న్యాయం చేయాలని సిఎం కెసిఆర్‌ను కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోలేదని, అక్కపై అనేక తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, ఇంతలా భయపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. హఫీజ్‌పేట భూములు తమవేనని, వాటిపై ఎప్పటి నుంచో వివాదం నెలకొన్నదని, నాన్న చనిపోయిన తర్వాత ఎ.వి.సుబ్బారెడ్డితో కొందరు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నాన్న చనిపోయిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని, వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సిఎం కెసిఆర్‌ను కోరారు. కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
హఫీస్‌పేట భూ కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టండి
హఫీస్పెట్ భూ కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని సుభాష్ చంద్ర బోస్ నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కమిటీ డిమాండ్ చేసింది. హఫీస్‌పేట పరిసర ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 77, 78, 79, 80లోని వందలాది ఎకరాల భూమిని అంతర్జాతీయ నేరస్తునిగా ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్, సినీ నిర్మాత సి.కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక మంత్రి సహకారంతో భూ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిటీ ముఖ్య సలహాదారులు గాదె ఇన్నయ్య ఆరోపించారు. బాధితులతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు సైతం కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ భూముల కబ్జాలో ఇప్పటికే 12 మంది హత్యకు గురయ్యారన్నారు.