ఎక్కడికక్కడే విపక్ష నేతలు, విద్యార్థి నాయకుల అరెస్టులు
ప్రముఖ నాయకుల గృహనిర్బంధం
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన అరెస్టుల పర్వం
చాడ వెంకట్‌రెడ్డి, రమణ, కోదండరామ్, పొన్నాల లక్ష్మయ్య, గూడూరు నారాయణరెడ్డి, గీతారెడ్డి, వినోద్‌రెడ్డిల అరెస్టు
విహెచ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్,
అంజన్ కుమార్ యాదవ్ గృహనిర్బంధం
ప్రజాపక్షం/హైదరాబాద్ : విద్యార్థి సంఘాలు, అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం జరిగిన ఇంటర్ బోర్డు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇంటర్‌బోర్డు కార్యాలయ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బోర్డు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. వందలాది మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నాం పల్లి పరిసర ప్రాంతాలో భారీ పోలీసు బలగాను మోహరించారు. వరుస అరెస్టుల పర్వంతో నాం పల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు ప్లకార్డులను ప్రదరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సోమవారం ఉదయం నుండే పోలీసులు ఇంటర్‌బోర్డు కార్యాలయానికి ఎవరు రాకుండా ఆ మార్గాలను బారికేడ్లతో మూ సివేసి పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే పలువురు రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశా రు. పోలీసుల కన్నుగప్పి ఇంటర్‌బోర్డు వద్దకు చేరుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాల నుండి బయల్దేరిన అఖిలపక్ష నేతలను ఆయా జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ప్రముఖ నాయకులను గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్, తెలంగాణ జన సమితి కార్యాలయం వద్ద భారీ పోలీసులను మోహరించారు. టిజెఎస్ అధ్యక్షులు కోదండరామ్, కాంగ్రెస్ నాయకులు పొన్నాల, హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, మేడ్చేల్‌లో కూన శ్రీశైలం గౌడ్‌నులను గృహనిర్బంధం చేశారు. కాగా పార్టీ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో కోదండరామ్‌ను పార్టీ కార్యాలయానికి అనుమతినిచ్చారు. ఆ తర్వాత కార్యాలయం నుంచి ఇంటర్ బోర్డుకు వెళ్లేంందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిజెఎస్ నాయకులను అరెస్టు చేసి నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎఐటియుసి, ఎఐడిఎస్‌ఒ, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు తదితర విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్ కుమార్ యాదవ్‌ను గృహనిర్బంధం చేశారు. పొన్నం ప్రభాకర్‌ను అరెస్టు చేసి రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.