HomeNewsBreaking Newsఅక్రమ నిర్మాణాలకు అడ్డేదీ?

అక్రమ నిర్మాణాలకు అడ్డేదీ?

అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు
ముడుపులు ముట్టజెబితే అంతా ఓకే అంటున్నారని అధికారులపై ఆరోపణలు
ప్రజాపక్షం/ సూర్యాపేటటౌన్‌
సూర్యాపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోయింది. పట్టణంలోని అంజనాపురి కాలనీలో అనేక మంది అక్రమార్కులు ఏలాంటి అనుమతులు లేకుండానే ఇండ్ల నిర్మాణాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేని ఇంటి నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులకు అక్రమ నిర్మాణదారులు ముడుపులు ముట్టజెపితే చాలు అంతా ఓకే అంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 65వ జాతీయ రహదారి నుండి జనగామ రోడ్డుకు వెళ్లే అంజనాపురి ప్రధాన వీధిలో ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కొక్కరు 400 గజాలలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టారు.ఇప్పటికే ఇంటి బేస్‌మెంట్‌, ఫీల్లర్ల నిర్మాణం చేపట్టారు. ఇట్టి నిర్మాణాలకు ఏలాంటి అనుమతులు లేవని స్ధానికులు చెబుతున్నారు. సామాన్యులు 100 గజాల స్థలంలో చిన్నపాటి ఇంటి నిర్మాణం చేపడితేనే అగమేఘాల మీద అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకునే అధికారులు ఈ ఇండ్ల నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులను ప్రశ్నించగా తమకు ఫిర్యాదులు అందిన విషయం వాస్తవమేనని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణ పనులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తే నోరుమెదపడం లేదు. ఒక్కొక్కరు 400 గజాల్లో భవన నిర్మాణ పనులు గత నెల రోజులుగా చేపడుతుండగా, వాటిపై ఫిర్యాదులు అందినా నిర్మాణాలను అడ్డుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి అధికారులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను నివారించేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, కమిటీ సభ్యులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments