HomeNewsBreaking Newsఅక్రమ కేసులు ఎత్తేయాలి

అక్రమ కేసులు ఎత్తేయాలి

కౌలుదారులకు రుణఅర్హతకార్డులు, బ్యాంకు రుణాలు అందించాలి
ప్రధానమంత్రి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండ్‌
ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌ నుండి ఇందిరా పార్కు వరకు ర్యాలీ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రి రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్‌, వాహనాలతో రైతులు ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల రుణాలు మాఫీ, రుణ విమోచన చట్టం చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని, రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, కౌలుదారులకు రుణ అర్హతకార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలనే డిమాండ్‌లపై హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌ నుండి ఇందిరా పార్కు వరకు సంయుక్త కిసాన్‌ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సంయుక్త కిసాన్‌ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్‌, రాయల చంద్రశేఖర్‌, కోటేశ్వర్‌రావు, జక్కుల వెంకన్న, కొండారెడ్డి, ప్రజా సం ఘాల నాయకులు ఉస్తేల సృజన, అంజయ్య నాయక్‌, వెంకట్‌రామ్‌, ఐసిఎఆర్‌లో పనిచేసిన రిటైర్డ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త సోము మర్ల, రైతు శ్రేయోభిలాషి రవి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఇందిరాపార్కులో జరిగిన సభలో పశ్య పద్మ మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దులను మూసివేసి రైతాంగం నిర్వహించిన సుదీర్ఘ పోరాట సమయంలో ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీలను ఇచ్చిందన్నారు. పంటల మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయడానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని, రైతులతో సంప్రదించకుండా విద్యుత్‌ సవరణ బిల్లు – 2020ను పార్లమెంటులో ప్రవేశపెట్టమని చెప్పిన కేంద్ర పాలకులు… 11 నెలలు పూర్తవుతున్నా ఆ వాగ్దానాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను చాపకింద నీరులాగా అమలుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. బడ్జెట్‌లో నిధులను ఎక్కువగా పెంచి, పంటల బీమా పథకాన్ని సవరించి సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పాలన స్తంభింపజేస్తామని హెచ్చరించారు. టి.సాగర్‌ మాట్లాడుతూ రుణమాఫీ చేసి, రుణ విమోచన చట్టం చేయాలని, రైతుల ఆత్మహత్యలను ఆపాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులున్నారని, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చి, బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. రాయల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ సందర్భంగా అమరులైన 750 రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోటేశ్వర్‌ రావు మాట్లాడుతూ 80 వేలకుపైగా అక్రమ కేసులు రైతులపై బనాయించారని, ఈ కేసులన్నింటిని ఎత్తివేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకట్‌రాములు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలన్నారు. ఉస్తేల సృజన మాట్లాడుతూ లఖీంపూరిఖేరీ దుర్ఘటనకు బాధ్యుడైన ఆశిష్‌ మిశ్రాను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంజయ్య నాయక్‌ మాట్లాడుతూ 2006 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు రైతులందరికీ భూమి పట్టాలు ఇవ్వాలన్నారు. కౌలు, పోడు రైతులకు రైతు సంక్షేమ పథకాలన్నింటిని వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో కేంద్ర పాలకులను ఓడిరచి తీరుతామని నేతలందరూ ముక్తకంఠంతో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ను హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments