ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ
బికెయు నేత రాకేష్ తికాయత్ ప్రకటన
ఘజియాబాద్: కొత్త సాగు చట్టాలను రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన అక్టోబర్ 2వ తేదీ వరకూ కొనసాగుతుందని, అప్ప టి వరకూ కదిలేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఈలోగా కేంద్రం ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే తర్వాతి కార్యాచరణను అప్పుడే నిర్ణయిస్తామ ని ‘చక్కా జామ్’ కార్యక్రమం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రాకేశ్ అన్నారు. తాము ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకూ నిరసన ప్రాం తాల నుంచి ఎవరూ కదలరని, ఉద్యమాన్ని మానుకోబోరని ఆయన తేల్చిచెప్పారు. ఒత్తిడి కి తలొగ్గేది లేదని, కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు చేయబోమని పేర్కొన్నారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 11 సార్లు చర్చలు నిర్వహించినప్పటికీ, ఎలాంటి ఫలితం రాలేదన్న విషయం తెలిసిందే. కొత్త గా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసేవిగా ఉన్నాయని, అన్నదాతల జీవితాలను ఛిద్రం చేసే వీటిని రద్దు చేసి తీరాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం చట్టాలను రద్దు చేసేందుకు సిద్ధంగాలేదు. ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను అమలు చేయకుండా చూస్తామని మాత్రమే హామీ ఇచ్చింది. కానీ, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ‘ఖానూన్ వాపసీ’ (చట్టాల రద్దు) తర్వాతే ‘ఘర్ వాపసీ’ (ఇళ్లకు తిరిగి వెళ్లడం) జరుగుతుందని భీష్మించుకున్నారు. గత నెల 26వ తేదీన, గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఎర్రకోటపై సిక్కు మత చిహ్నమైన ఖల్సా జెండాను ఎగరేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆతర్వాత రైతు సంఘాలు ఇచ్చిన తొలి కార్యక్రమంగా ‘చక్కా జామ్’ను పేర్కోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాస్తా రోకోలను నిర్వహించి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని ఈ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఢిల్లీ సరిహద్దులను పోలీస్‌లు, భద్రతా దళాలు అష్టదిగ్బంధనం చేశారు. రోడ్లపై తాత్కాలిక గోడలు నిర్మించడం, ఇనుమ మేకులను నాటడం, కాంక్రీట్ దిమ్మెలను ఉంచడం వంటి పలు చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. అయితే, శనివారం నాటి ‘చక్కా జామ్’ శాంతియుతంగా ముగిసిందని, పోలీస్‌లు కొన్ని ప్రాంతాల్లో బలప్రయోగాలకు పాల్పడ్డారని రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ‘చక్కా జామ్’ను హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉన్నందున, ఢిల్లీ, ఉత్తారాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఈ నిరసన కార్యక్రమం నుంచి మినహాయించినట్టు తెలిపారు. రైతు సమస్యలను రిష్కరించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకూ తాము విశ్రమించబోమని ప్రకటించారు.
అక్టోబర్ 2 వరకూ కదలం
RELATED ARTICLES