HomeNewsBreaking Newsఅకాల వర్షం ... రైతన్న కుదేలు

అకాల వర్షం … రైతన్న కుదేలు

ధాన్యం మొలకెత్తడంతో ఆందోళన
మందకొడిగా కొనుగోళ్లు
కేంద్రాల్లో భారీగా నిల్వలు
మార్కెట్లలో టార్పాలిన్లు లేక అవస్థలు
దిక్కుతోచని స్థితిలో అన్నదాత
ప్రజాపక్షం/చిట్యాల/తొర్రూరు రూరల్‌/ ఖానాపూర్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాలలో నిల్వలు తగ్గడం లేదు. కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో రైతు విలవిలలాడుతున్నాడు. ఒకవైపు ముబ్బులు కమ్ముకొచ్చి అకాల వర్షాలు కురుస్తుంటే ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్న పరుగులు తీస్తున్నాడు. కాలాన్ని, కష్టాన్ని నమ్ముకుని పంటలు పండించిన రైతు ప్రకృతి చేతిలో బంధీ అవుతున్నాడు. అన్నదాతను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల పేరుతో అనేక కష్టాలకు గురి చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు వరి ధాన్యానికి తరలించారు. కొనుగోళ్లు ప్రారంభించడం కంటే ముం దే ధాన్యం కేంద్రాలకు చేరింది. అప్పటి నుండి తమ ధాన్యం ఎప్పుడు అమ్ముడు పోతుందో, తమ చేతికి అమ్మిన ధాన్యం డబ్బు ఎప్పుడు చేతికి వస్తుందో, ఎప్పుడు తమ అప్పులు చెల్లించాలా అని రైతు ఆవేదనతో నిండిపోయాడు.
అధిక మొత్తంలో పంట దిగుబడిమండల పరిధిలో గత సంవత్సరం కంటే ఈసారి అధిక సంఖ్యలో ధాన్యం దిగుబడి అయింది. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో సుమారు 2 లక్షల 30 వేల క్వింటాళ్ళ ధాన్యం దిగుబడి జరిగింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం రాసులు పేరుకుని పోయాయి.
నిండా ముంచుతున్న వర్షాలు
ఒక వైపు ధాన్యం కొనుగోలు జరగక నానా అవస్థలు పడుతున్న రైతులకు ఇటీవల నిత్యం కురుస్తున్న వర్షాలువారిని బెంబేలెత్తిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలలో రాసులుగా ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయి. ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతుంది. మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. తేమ శాతం బూచిగా చూపి ధాన్యం కొలతల్లో కత్తెర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు తాను పండించిన పంటకు ఆశించిన మేర పైకం రాదన్న నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యాన్ని చూస్తూ రైతన్న చలించిపోతున్నాడు. ఏ రైతును కదిలించినా దుఃఖ వదనంతో కనిపిస్తున్నాడు.
కొనుగోలులో తీవ్ర జాప్యంః
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌, సింగిల్‌ విండో, శివనేనిగూడెంలతో పాటుగా మండలంలోని వట్టిమర్తి, వనిపాకల, ఉరుమడ్ల, నేరడ, తాళ్ల వెల్లంల, గుండ్రాంపల్లి, ఏపూర్‌, సుంకెనపల్లి, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, వెల్మినేడు, ఆరెగూడెం, పిట్టంపల్లి గ్రామాలలో ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాగా ఆయా సెంటర్లలో రైతుల ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయని రైతులు వాపోతున్నారు.
అకాల వర్షం… తడిసిన ధాన్యం
మహబాదు జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో గత 15 రోజులుగా రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా అకాలంగా వర్షం పడటంతో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో బోరున విలపించిన రైతులు ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. వాతావరణ మార్పులతో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియడం లేదని వాపోయారు.
కమ్ముకొస్తున్న మబ్బులు..పరుగులు పెడుతున్న రైతు
తాము పండించిన ధాన్యాన్ని నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మార్కెట్‌ యార్డుకు తరలించగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పెడుతున్న నియమ నిబంధనలకు రైతులు బెంబేలెత్తుతున్నారు. దీంతో తమ పంటను కాపాడుకునేందుకు కుటుంబం మొత్తం మార్కెట్‌ యార్డులో పడిగాపులు కాస్తున్నారు. ఇంకోవైపు ఆకాశం వైపు చూస్తున్న రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఖానాపూర్‌ మార్కెట్‌ యార్డులో నాలుగు మండలాల రైతుల పరిధిలో విస్తరించి ఉండగా సుమారు 50 కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేశారు. ఐకెపి, పిఎసిఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు చాలినన్ని టార్ఫాలిన్‌లు సరఫరా చేయాల్సి ఉండగా ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసి మెలకెత్తుతోందని రైతులు వాపోతున్నారు. తేమశాతం పేరుతో రైతులను వేధించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం, పాలకులు స్పందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments