ప్రజాపక్షం / అమరచింత / పానుగల్ : వనపర్తి జిల్లా అమరచింత, పానుగల్ మండలాలలోని వివిధ గ్రామాలలో చేతికొచ్చిన వరి పంట గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి మొలకెత్తడం ఖాయమంటున్నారు రైతులు. మండలంలోని చంద్ర నాయక్ తండా, సింగం పేట, నందిమల్ల, ధర్మాపూర్, మస్తిపురం తదితర గ్రామల్లో వందలాది ఎకరాల చేతికొచ్చిన పంట భారీ వర్షానికి నేలకొరిగింది. నేలకొరిగిన వరి పంట రైతులు బావురుమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కుటుంబ సభ్యులు మొత్తం కష్టపడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కౌలు రైతులు పెట్టిన ఖర్చులు వస్తాయో రావో అన్న దిగులుతో ఉన్నారు. మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు నత్తనడకన సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఎక్కువ మొత్తం ప్రారంభించి ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పానుగల్ : మండలంలోని శాగాపూర్, పానుగల్, అన్నారం తదితర గ్రామాలలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరి పంటలు నేలకొరిగాయి, కోత దశలో వరి పంటలు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలలోని కొన్ని గ్రామాలలో రైతులు వరి పంటలను కోసి వరి ధాన్యాన్ని కేంద్రాల వద్ద ఉంచడంతో అకాల వర్షానికి తడిసింది. రైతులు ధాన్యం కవర్లు కప్పడంతో కొంత మేరకు తడవకుండా కాపాడుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
అకాల వర్షం అపార నష్టం
RELATED ARTICLES