న్యూఢిల్లీ: రబీ సీజన్‌లో అకాల వర్షాలు రైతుకు భారీ నష్టాలను, ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టాయి. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ ఆహూజా పిటిఐకి అందించిన సమాచారం ప్రకారం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా సుమారు 5.23 లక్షల ఎకరాల్లో గోధుమ పంట ధ్వంసమైంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన నష్టాలను లెక్కిస్తున్నారు. ఉత్తర భారత దేశమంతటా రబీ సీజన్‌లో ఎక్కువగా గోధుమను పండిస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా గోధులు పండించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో 34 మిలియన్ హెక్టార్లలో గోధుమ వేశారు. 2022 జులై నుంచి 2023 జూన్ వరకూగల ప్రస్తుత క్రాప్ ఇయర్‌లో 112.2 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కానీ, అకాల వర్షాలు ఈ అంచనాలను తారుమారు చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కేవలం మూడు రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించగా, మిగతా రాష్ట్రాల నుంచి గణాంకాలు అందిన తర్వాత పంట దిగుబడి ఎంత ఉంటుందనేది స్పష్టమవుతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నమోదవుతున్న అకాల వర్షాలు భారీ నష్టాలకు కారణమవుతాయని అధికారులు అంటున్నారు. సాధారణంగా ఎకరాకు సుమారు 20 క్వింటర్ల గోధుమ పండుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుంచి 11 క్వింటళ్ల దిగుబడి కూడా గగనంగానే కనిపిస్తున్నది. ఇలావుంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలుసహా దక్షిణాదిలోనూ అకాల వర్షాలు రైతులకు భారీ నషాటలు మిగిల్చాయి. తెలంగాణ సర్కారు ఇప్పటికే పంట నష్టం వివరాలను తెప్పించుకొని, రైతులకు పరిహారం చెల్లించేందుకు సమాయత్తమవుతున్నది.
అకాల వర్షంతో రైతన్నకు..ఎంత కష్టం.. ఎంత నష్టం..
RELATED ARTICLES