అధికార, ప్రతిపక్ష సభ్యులను తేడా లేకుండా చూస్తా
ఆదర్శ అసెంబ్లీగా తీర్చిదిద్దుదాం : పోచారం
స్పీకర్‌గా ఏకగీవ్రంగా ఎన్నిక
సభాపతి స్థానంలో కూర్చోబెట్టిన సిఎం, ఉత్తమ్, బలాలా, ఈటల
ప్రజాపక్షం / హైదరాబాద్ : “సభ్యులందరం కలిసి శాసనసభను ఆదర్శ శాసనసభ గా తీర్చిదిద్దుదాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. శాసనసభాపతి పదవి అత్యం త కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్ధంగా, అధికార, ప్రతిపక్ష సభ్యులనే తేడా లేకుండా సమదృష్టితో వ్యవహరిస్తాను. ప్రజాహితమే ధ్యేయంగా సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాను. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నిర్వహించుకోవడం మనందరి బాధ్యత” అని రాష్ట్ర శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో తొలిసారిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర రెండో శాసనసభకు స్పీకర్ ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్క సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలను, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికైన తనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. సభ్యులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందామని, సమస్యలను ప్రజాస్వామ్య దృష్టితో పరిష్కరించుకుందామని చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో సభ్యులంతా తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత పెంపొందించుకుందామని తెలిపారు. వ్యవసాయ శాఖమంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన తన స్నేహితుడి కుమారుడు జాజల సురేందర్ చెప్పినట్లు ఆయన రాజకీయాలకు రావడానికి తానే స్పూర్తి అయినప్పటికీ టిడిపి నుంచి మూడు సార్లు టిక్కెట్ ఇప్పిస్తే ఓడిపోయారని, ఈసారి కాంగ్రెస్ నుంచి గెలవడానికి తన స్ఫూర్తి లేదని స్పీకర్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. అనంతరం స్పీకర్ సభను శనివారం ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు.