- స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి
- పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్ చీఫ్ కెసిఆర్ సూచన
- ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదు, 27న భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు వెల్లడి
- పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం
ప్రజాపక్షం/హైదరాబాద్
స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు అందరూ కష్టపడాలని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరారు. మహిళా రిజర్వేషన్లు అమలులోనికి రానున్నాయని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని,అవకాశాలు మరింత పెరుగుతాయని, అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పార్టీ మారిన పది మంది ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కెసిఆర్ జోస్యం చెప్పారు.పార్టీ కమిటీల ఏర్పాటుకు ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపి సీటు కూడా రాకపోవడం పట్ల సొంత పార్టీ నేతలే ప్రతికూలంగా, పార్టీ పనైపోతుందా?అనే కోణంలో మాట్లాడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం పెరిగిందని,కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని చెప్పారు. అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో కూడా ఈ ప్రభుత్వానికి రావడం లేదని ఎద్దేవా చేశారు. సిఎంపై ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తాను అనుకోలేదని,పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని కెసిఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజల కష్టాలు బిఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసని, తామే వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్, నవంబర్‌లో బిఆర్‌ఎస్ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నాయకులతో సబ్ కమిటీలు వేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు.
డబ్బాలొద్దు..వాస్తవాలు చెప్పండి..?
కాగా ఈ సమావేశంలో కెసిఆర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన పలువురు నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కొందరు నాయకుల మాట్లాడగా ‘ డబ్బాలు కొట్టవద్దని. వాస్తవాలను చెప్పాలని”వారికి కెసిఆర్ సూచించినట్టు సమాచారం. అనంతరం పార్టీ బలోపేతానికి, ప్రస్తుతం చేయాల్సిన కార్యచరణపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఉద్యమ చరిత్ర, బిఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానంపై వ్యాసాలు, డాక్యుమెంటరీలను రూపొందించాలని కెసిఆర్ సూచించారు. ఇదిలా ఉండగా ఏడు నెలల విరామం తరువాత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు.
ఏడాది పాటు బిఆర్‌ఎస్ రజతోత్సవాలు : కెటిఆర్
బిఆర్‌ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కెటి.రామారావు వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణ నిమిత్తం ఉద్యమకారులు, పార్టీ ముఖ్య లతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. బిఆర్‌ఎస్ కార్యవర్గ విస్తృత సమావేశ వివరాలను కెటిఆర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని, ఏప్రిల్ 27న బహిరంగ సభను నిర్వహిస్తామని, దీనికి సంబంధించి తేదీ, వేదికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఒక వైపు రజతోత్సవ సంబరాలను నిర్వహిస్తూనే పార్టీ నిర్మాణం, ప్రజా పోరాటాలను చేస్తామన్నారు. తాగునీరు, కరెంటు సమస్య, విద్య, వైద్యం అందించడంలో జరుగుతున్న లోపాల పై పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు ఆయన వివరించారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడకుంటే బిఆర్‌ఎస్ తరఫున తమ కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు. ఎనిమిది మంది బిజెపి ఎంపిలు ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నయా పైసా తీసుకురాలేదని మండిపడ్డారు. ఈ ఏడాది మొత్తం బిఆర్‌ఎస్ విస్తృత కార్యక్రమాలలోనిమగ్నమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బిసిల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే 42 శాతం రిజర్వేషన్‌ను ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.