రెవెన్యూ, మున్సిపల్ చట్టాల సవరణకు లోతైన అధ్యయనం అవసరం
సిఎం కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ : రెవెన్యూ, మున్సిపల్ చట్టాల సవరణకు లోతైన అధ్యయనం చేయాలని సిపిఐ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. చట్టాలను సవరించడానికి తొందరపడి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, అందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కొత్త చట్టాలు మార్గదర్శంగా ఉండాలని, అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అందరి సలహా మేరకు చట్టసవరణ చేయాలని కోరింది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. రెవెన్యూ చట్టాల సవరణకు సిపిఐ అనుకూలమేనని అయితే రెవెన్యూ ఉద్యోగులు, రెవె న్యూ నిపుణులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి, అందరి అభిప్రాయాలు క్రోడీకరించి రెవెన్యూ చట్టాలకు తుదిరూపం ఇవ్వడం సమంజసంగా ఉంటుందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చట్ట సవరణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం మంచిదేనని, అయితే దీంతోనే అవినీతి అంతం కాదని ఆయనన్నారు. అమలు చేసే యంత్రాంగం జవాబుదారీగా ఉన్నప్పుడే అవినీతికి తావుండదన్నారు. అనేక చట్టాలు మారి నా సామాజిక, ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో చట్టాల సవరణకు అవశ్యకత ఉందని, పారదర్శకత లేకుండా పరిపాలనలో సంస్కరణలు రాకుం డా కొత్తదనం లేకుండా అవినీతి అంతం కాదన్న విషయం గ్రహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమి ప్రధాన ఎజెండాగా ఉంటుందని భావించామని, రెవెన్యూ చట్టాలలోని లోపాలని, సర్వేనెంబర్ హద్దులు చెరిగిపోయి పల్లె నుండి ఢిల్లీ వరకు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మీ దృష్టికి తెచ్చామని చాడ తన లేఖ లో పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాలను మార్చకుండా భూమి, భూమి రికార్డులు సరిచేయలేమని, గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. గత సంవత్సరం నుండి భూ ప్రక్షాళన పేరుతో ప్రయత్నం చేశారని, అయితే భూ సమగ్ర సర్వే చేయకుండా రికార్డులు సరికావడం సాధ్యం కాదని ఆనాడే చెప్పామని చాడ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. రెవెన్యూ ఉద్యోగుల అవినీతి ప్రధాన కారణంగా చూపడం భావ్యం కాదని, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టినపుడు ఆ ప్రభావం అన్ని విభాగాలపై అనివార్యంగా ఉంటుందన్నారు. అప్పటికి, ఇప్పటికీ భూముల స్వరూపంలో మార్పులు వచ్చాయని దీనిపై కూడా లోతుగా విశ్లేషణ జరపాలని ఆయన కోరారు.