రాక్షస రాజకీయం చేస్తున్న బిజెపిని ఓడించాలి
ఓటర్లకు సిపిఐ నేతల పిలుపు
టిఆర్‌ఎస్ గెలుపు కోసం చండూరులో కమ్యూనిస్టుల భారీ ర్యాలీ
పాల్గొన్న పార్టీ రాష్ట్ర నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/చండూరు మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఐ(ఎం) బలపర్చిన టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడు ప్రజలు భారీ మెజారీటితో గెలించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కార్యవర్గ సభ్యుడు, చండూరు వైస్ ఎంపిపి మందడి నర్సింహారెడ్డి , మండల కార్యదర్శి నల్పరాజు సతీష్‌కుమార్‌లతో కలిసి బుధవారం చండూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో తిరుగుతూ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అనంతరం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడారు. యావత్ భారతదేశం మునుగోడు ఉప ఎన్నిక వైపు చూస్తున్నదన్నారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. తన స్వార్థం, వ్యక్తి గత ప్రయోజనాల కోసం బిజెపికి అమ్ముడుపోయి ఆ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి ధర్మ యుద్ధం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ధర్మ యుద్ధం అంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి లేదా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలన్నారు. బిజెపి వేల కోట్ల రూపాయల ధన బలంతో మునుగోడులో గెలవాలని చూస్తుందని, అది సాధ్యం కాదని, మునుగోడు ప్రజలు చైతన్యవంతులన్నారు. మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల గడ్డ అని ఎరుపెక్కిన గడ్డ అని, ఇలాంటి మునుగోడు గడ్డపై బిజెపి పాచికలు పారవన్నారు. బిజెపిది రాక్షస పాలన, రాక్షస రాజకీయాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవానికి పట్టిన శని గ్రహణాన్ని వదిలించుకోవాలంటే మునుగోడులో బిజెపికి డిపాజిట్ రాకుండా చేయాలన్నారు. మునుగోడులో టిఆర్‌ఎస్ గెలిస్తే కమ్యూనిస్టు గెలిచినట్లేనని స్పష్టం చేశారు. పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో బిజెపిని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని చెప్పారు. మునుగోడు కమ్యనిస్టు నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టుల బలంతో మునుగోడు గడ్డపై గులాబీ జెండా నూరుకు నూరు శాతం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బిజెపికి మూడవస్థానం మాత్రమేనని అన్నారు. చండూరు పట్టణంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి ఓటర్లను కలుస్తూ కారు గుర్తును గెలిపించుకుంటే మునుగోడు అభివృద్ధి జరుగుతుందన్నారు. సిపిఐ నిర్వహించిన ప్రచారంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డిని కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, చండూరు మాజీ జెడ్‌పిటిసి మాదగోని విజయలక్ష్మీ, నాయకులు నల్పరాజు రామలింగయ్య, బోయపల్లి భిక్షమయ్య, తిప్పర్తి రాములు, పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అందరి చూపు మునుగోడు వైపే!
RELATED ARTICLES