అట్టడుగు వర్గాలకు నేటికీ అందని న్యాయం
న్యాయవ్యవస్థలో ‘ఎఐ’తో బాధితులకు సత్వరన్యాయం అందించాలి
ప్రమాణాలతో, నిబద్ధతతో పని చేస్తే ఉన్నత శిఖరాలు
నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రజాపక్షం/మేడ్చల్ ప్రతినిధి
నేటి సమాజంలో సంపన్న వర్గాలకు లభిస్తున్న న్యాయం అట్టడుగు వర్గాల వారికి లభించటం లేదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. యువ న్యాయవాదులు ఈ దిశగా సేవాభావంతో ముందుకు వెళ్లి మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెరుగైన సమాజం కోసం ఈ తరం న్యాయవాదులు మార్గదర్శకులుగా నిలవాలన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ యునివర్సిటీలో జరిగిన 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి యువ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయరంగం సైతం కృత్రిమమేధతో (ఎఐ)పాటు ఆధునిక సాంకేతిక వ్యవస్థను వినియోగించుకొంటూ బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేలా చూడాలన్నారు. న్యాయవాదులు ఏ రంగంలో పని చేసినా నిబద్ధత, పారదర్శకంగా ఉంటే అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఏ సమాజంలో అయినా సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి న్యాయ వ్యవస్థ ఒక ప్రతిబింబమని, 2,300 ఏళ్ల క్రితమే చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో మంత్రిగా పని చేసిన చాణక్యుడు తన ప్రసిద్ద గ్రంథమైన ఆర్థిక శాస్త్రంలో సామాజిక న్యాయం విషయమై అనేక అంశాలు ప్రస్తావించటంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం లభించేందుకుగాను ప్రతి 10 గ్రామాలకు ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ధర్మాసన అవసరాన్ని తెలియ చేసిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేసారు. అదే విధంగా న్యాయాన్ని అందచేయటంలో ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని సైతం అర్థశాస్త్రంలో చాణక్యుడు ఉటంకిస్తూ కేసు విచారణ ముగిసి పరిష్కారం(జడ్డిమెంట్) ప్రకటించే వరకు న్యాయమూర్తులు, కక్షిదారులు వ్యక్తిగతంగా కలువరాదన్న విషయాన్ని స్పష్టం చేసారని రాష్ట్రపతి తెలిపారు. మన దేశంలో న్యాయ సంప్రదాయాలు అత్యంత విలువైనవని, న్యాయం కోసం మహాత్ముడు సైతం పోరాటం చేసారని, పేద రైతులకు ఇండిగో వ్యాపారుల నుండి ఎదురైన అన్యాయానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారన్నారు. అదే విధంగా మహాత్ముడు కొనసాగించిన స్వాతంత్ర పోరాటంలో సత్యాగ్రహ దీక్ష ద్వారా న్యాయ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారన్నారు. న్యాయవాదులు కార్పొరేట్ సంస్థల్లో సలహాదారులుగా ఉంటున్నప్పటికీ న్యాయ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా సలహాలివ్వాలని సూచించారు.
అత్యున్నత ప్రమాణాలతో నల్సార్ యూనివర్సిటీ
అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చి దిద్దుతూ నల్సార్ యునివర్సిటీ విధానాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. న్యాయ సౌలభ్యం, జైళ్లు, బాలల న్యాయ చట్టం, న్యాయ సహాయం సంబంధిత అంశాలపై యూనివర్సిటీ శ్రద్ద కనపరుస్తోందని, ఇక్కడ జంతు న్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం న్యాయ విద్యారంగంలో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కృత్తిమ మేధ(ఎఐ)ని ఒక అధ్యయనాంశంగా గుర్తించి ఈరంగంపై దృష్టి సారించటం మరింత అభినందనీయమన్నారు. పిహెచ్‌డి, ఎల్‌ఎల్‌ఎం, ఎంబిఎ, బిఎఎల్, బిబిఏ, పిజి డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టీస్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన 592 మంది విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలను అందచేసారు. దీంతో పాటు 57 మందికి బంగారు పతకాలు అందచేసారు. స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందుకొన్న వారిలో విద్యార్థినులే అధిక సంఖ్యలో ఉండటం గర్వకారణమని, యువ న్యాయవాదులంతా సాటి మహిళలు, అణగారిన వర్గాల బాలికలకు చేయూత, సాధికారిత కల్పనలో తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. అదే విధంగా దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే దిశగా పూర్వ విద్యార్థులతో పాటు మహిళా న్యాయవాదులంతా కలిసి జాతీయ స్థాయిలో ఓ నెట్‌వర్క్ ఏర్పాటుకు యూనివర్సిటీ కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయయూర్తి అలోక్ ఆరాధే తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ కృష్ణదేవరావు యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు.
రాష్ట్రపతికి ఘన స్వాగతం
అంతకుముందు ఒక రోజు పర్యాటన నిమిత్తం శనివారం హైదరాబాద్‌కు వచ్చినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి పూస్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అదేవిధంగా, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిమంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పలువురు ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపతిముర్మూ శామిర్‌పేట్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోచవంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. బేగంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ విడ్కోలు పలికారు.