ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని శ్మశానవాటిక మైదానంలో కూలిన పైకప్పు
23 మంది మృతి : మరో 15 మందికి గాయాలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 23 మంది మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్మశాన వాటికలో ఆదివారం ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతు న్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంత్యక్రియలకు హాజరైన మృతుల బంధువులు వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వర్షం కారణంగా భవనం పైకప్పు కూలిపోయింది. ఘటనా స్థలిలో 8 మంది మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిగిలిన వారు మరణించారు. రాజధాని పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఘజియాబాద్ ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేంద్రమంత్రి, ఘజయాబాద్ ఎంపి వికె సింగ్, అనేమంది సీనియర్ పోలీసు,ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. యుపి ఆరోగ్యమంత్రి అతుల్‌గార్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఘటన తీవ్ర విచారకరం : రాష్ట్రపతి
మురాద్‌నగర్ ఘటన తీవ్ర విచారకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
అంత్యక్రియలకు వచ్చి మృత్యువాత
RELATED ARTICLES