కిసాన్ సంసద్’లో మహిళా రైతుల ఆశాభావం
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దు కోసం తాము చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనని ‘కిసాన్ సంసద్’లో పాల్గొన్న మహిళా రైతులు ఆశాభావం వ్యక్తం చే శారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకొని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో రైతులు ‘కిసాన్ సంసద్’ (రైతు పార్లమెంటు) ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేవలం 200 మందికి మాత్ర మే అధికారులు అనుమతినివ్వడంతో, దశల వారీగా పలు సంఘాలకు చెందిన నాయకులు, సామాజిక కార్యకర్తలు, రైతులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. సోమవారం నాటి నిరసనల్లో మహిళా రైతులు పాల్గొనడం విశేషం. వారికి మద్దతు తెలిపేందుకు సిపిఎం నాయకురాలు సుభాషిణి అలీ, ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పట్కర్ తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ సుమారు ఎనిమిది నెలుగా సాగు చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి, ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం అన్ని వర్గాలతో చర్చించి, కొత్త చట్టాలకు రూపకల్పన చేయాలని సూచించారు. తమ ఉద్యమానికి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని అన్నారు. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై ప్రపంచంలోని పలు దేశాల చట్టసభల్లోనూ చర్చ జరిగిందంటే, దీని తీవ్రతను, ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని మహిళా రైతులు వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యులు కూడా రైతు సమస్యలను ఉభయ సభల్లో లేవనెత్తాలని కోరారు. రైతు సమస్యలను ప్రస్తావిస్తే, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే రాజద్రోహం కింద కేసులు పెట్టడాన్ని వారు తప్పుపట్టారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి చర్యలు తగవని అన్నారు. లక్షలాదిగా రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో గమనించి, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. సాగు చట్టాల రద్దు విషయంలో ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఆందోళన ఆగదని తేల్చిచెప్పారు.