కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాధికారం సర్వోన్నత మండలిదే
స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజలాల ట్రిబ్యునల్
కొత్త డిపిఆర్‌ల సమర్పణకు ఇరు రాష్ట్రాల సిఎంలు సుముఖత
జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సుదీర్ఘ సమావేశం
బలమైన వాదనలు వినిపించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్
ప్రజాపక్షం / హైదరాబాద్
కృష్ణా జలాల ట్రిబ్యునల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పా టు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అపెక్స్ కౌన్సిల్లో అంగీకారం కుదిరిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులకు డిపిఆర్‌లను సమర్పించాలని రెండు రాష్ట్రాల సి ఎంలను కోరామని, డిపిఆర్లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల సిఎంలు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర మంత్రి షెకావత్ నేతృత్వంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న ఎపి ఎం జగన్ జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి పరిధిలోని సమస్యలపై చర్చించారు. సమావేశంలో తెలంగాణసమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని మంత్రి తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్, కృష్ణా నదీ జలాల బోర్డు ఏర్పాటైందని తెలిపారు. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించామని, ఇద్దరు సిఎంలు తమతమ వాదనలు వినిపించారని, రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై చర్చించామన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సిఎం కెసిఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు జరగాలని సిఎం కెసిఆర్ కోరారని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ పరిష్కారానికి వచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, నాలుగేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి కౌన్సిల్ మంగళవారం భేటీ అయిందని, ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు. ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు. భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని షెకావత్ అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదేనని షెకావత్ పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లు ఇచ్చేందుకు ఇద్దరు సిఎంలు అంగీకరించారని.. అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు. నదీజలాల పంపిణీపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకుంటామని కెసిఆర్ చెప్పారని షెకావత్ వెల్లడించారు. కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపరమైన అంశాలు పరిశీలించి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
చట్టప్రకారమే ముందుకెళ్తాం
నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదన్నారు. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించామని.. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఎపికి తరలించడంపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే ముందుకెళ్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రి పేర్కొన్నారు. పోలవరానికి బిల్లులు ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేశామన్న మంత్రి.. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయాలనేది మా లక్ష్యమన్నారు. వీలైతే ఈ నెలాఖరులో ప్రాజెక్టును సందర్శిస్తానని షెకావత్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా సమావేశంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఎపి స్పష్టం చేసినట్లు సమాచారం. తాము వాడుకుంటున్నది మిగులుజలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఎపి తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలపైనే తమ వాదనలు వినిపించాయి. ఈ సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలను చర్చించాలని అజెండా రూపొందించినప్పటికీ, ఆ నాలుగు అంశాల అనుబంధ అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పగించాలని తెలంగాణ కోరగా, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఎపి సూచించింది.
అంతిమ నిర్ణయం అపెక్స్దే!
RELATED ARTICLES